నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (Artificial Intelligence – AI) కోర్సును బోధించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ 10 మండలాల్లోని 13 ప్రభుత్వ పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి కోర్సు బోధనను ప్రారంభిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పఠనా సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ఈ ప్రయోగాత్మక నిర్ణయం ద్వారా విద్యార్థుల బుద్ధి వికాసాన్ని పెంపొందించడంతో పాటు, వారి నైపుణ్యాలను మెరుగుపరిచే అవకాశాలు లభిస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి విద్యను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని 10 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా 13 స్కూళ్లలో కోర్సును ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశారు.
ఈ ఏఐ విద్యా ప్రణాళికను ప్రయోగాత్మకంగా మొదట నాగర్ కర్నూల్ జిల్లాలోని 10 మండలాల్లోని 13 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. బిజినపల్లి మండలంలోని వట్టెం ప్రాథమిక పాఠశాల, చారగొండ మండలంలోని జూపల్లి ప్రాథమిక పాఠశాల, కోడేరు మండలంలోని కొండ్రావుపల్లి ప్రాథమిక పాఠశాల, కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు ప్రాథమిక పాఠశాల, ఎన్మనబెట్ల ప్రాథమిక పాఠశాల, పెద్దకొత్తపల్లి మండలంలోని గండ్రావుపల్లి ప్రాథమిక పాఠశాల, చంద్రకల్ ప్రాథమిక పాఠశాల, పెంట్లవెల్లి మండలంలోని కొండూరు ప్రాథమిక పాఠశాల, తాడూరు మండలంలోని ఐతోల్ ప్రాథమిక పాఠశాల, తెలకపల్లి మండలంలోని ఆలేరు ప్రాథమిక పాఠశాల, తిమ్మాజిపేట మండలంలోని మారేపల్లి ప్రాథమిక పాఠశాల, చేగుంట ప్రాథమిక పాఠశాల, వంగూరు మండలంలోని వంగూర్ ప్రాథమిక పాఠశాలను అధికారులు ఎంపిక చేశారు.
ఈ 13 ప్రాథమిక పాఠశాలల్లో 1183 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యనందించేకు ఎంపిక చేసి ఒక్కో పాఠశాలలో 5 నుంచి 10 కంప్యూటర్లను సిద్ధం చేశారు. మొత్తం 13 పాఠశాలల్లో 75 కంప్యూటర్లను, హెడ్ ఫోన్స్, ఇంటర్నెట్ సదుపాయంతోపాటు ఇతర అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాట్లు చేశారు. ఆయా స్కూళ్లలో ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎడ్యుటెక్ ఆధారిత శిక్షణ అందించనున్నారు.
AI ఆధారిత లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల బలహీనతలను గుర్తించి, వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు టీచర్లు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఇది విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస శైలిని మెరుగుపరచడంలో సహాయపడనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఏఐ టెక్నాలజీ సహాయంతో వారి నేర్చుకునే విధానాన్ని విశ్లేషించి, వారికి తగిన మార్గదర్శకత ఇవ్వనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులతో పోటీచేసే స్థాయికి చేరుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే జిల్లావ్యాప్తంగా మరిన్ని స్కూళ్లలో దీన్ని విస్తరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ప్రత్యేక సాఫ్టువేర్‌తో చిన్నారులను ఆకట్టుకునేలా ఏఐ ద్వారా బోధన అందించి, ఎంపిక చేసిన 3, 4, 5 తరగతుల వారిని అయిదుగురికి ఒక బ్యాచ్ గా ఏర్పాటు చేసి, ఒక్కో బ్యాచ్‌కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలను బోధించనున్నామని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్ చెప్పారు. విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా లేదా అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో.. అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తూ, ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాల ప్రమాణాలను మదింపు చేయడంతో పాటు, మునుపటితో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి వారి నివేదికను రూపొందిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యమని అన్నారు.
3వ, 4వ, 5వ తరగతుల్లో ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలు ఉండటంలేదని, చతుర్విద ప్రక్రియల్లో వెనుకబాటుకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికే పలు రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితాలు మెరుగుపడటం లేదన్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ సాయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 13 పాఠశాలలను ఎంపిక చేయగా, ఆయా తరగతుల్లో వెనుకబడిన సీ గ్రేడ్ విద్యార్థులను గుర్తించి, ఆ విద్యార్థులకు ఈకే-స్టెప్ అనే కంపెనీ సహకారంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఏఐ బోధన అందిస్తామన్నారు. ఇందుకోసం ఆ పాఠశాలల్లో లేదా పక్కన ఉన్న ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్లను ఉపయోగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యను అందిస్తున్నామని చెప్పారు.