SLBC Tunnel Mishap | అచ్చంపేట, మార్చి 20: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న ఏడుగురి మృతదేహాల వెలికితీతకు 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌పై ఇవాల నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపెంట, SLBC ఇన్లేట్ 1 ఆఫీస్ వద్ద నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు.
ఈ సమావేశంలో ఆర్మీ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా, డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. సహాయక బృందాల ఉన్నతాధికారులు, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ప్రతినిధులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్, దక్షిణ మధ్య రైల్వే, అన్వి రోబోటిక్స్, ర్యాట్ హోల్ మైనర్స్, కడావర్ డాగ్ స్క్వాడ్ తదితర సంస్థల అధికారులు ఈ సమావేశంలో హాజరయ్యారు.
సహాయక చర్యల పురోగతి..
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, టన్నెల్లో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రమాద ప్రదేశంలో నీటి ఊటలు, మట్టి, పెద్ద బండరాళ్లను తొలగించేందుకు అధునాతన పరికరాలను వినియోగిస్తున్నారు. అధిక సామర్థ్యం గల పంపుల ద్వారా నీటిని బయటకు తరలిస్తున్నారు. స్టీల్, మట్టిని పూర్తిగా తొలగించేందుకు ఎక్స్కవేటర్, లోకో ట్రైన్, కన్వేయర్ బెల్ట్ వంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు.
ఐదు షిఫ్టుల్లో సహాయక చర్యలు..
సహాయక బృందాలు రోజుకు ఐదు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయి. ఉదయం 7 గంటలు, 11 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి 7 గంటలు, 11 గంటల షిఫ్టుల్లో ప్రత్యేక బృందాలు నిత్యం సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. టన్నెల్లోపల పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ సంస్థల కృషికి ప్రశంసలు..
26 రోజులుగా నిరంతరాయంగా సహాయక చర్యలలో పాల్గొంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహాయక బృందాలను మేజర్ అజయ్ మిశ్రా అభినందించారు. టన్నెల్ లోపల రక్షణ ప్రమాణాలను పాటిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల సమీక్ష..
సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు కల్నల్ సురేష్, కల్నల్ పరీక్షిత్ మెహర, వికాస్ సింగ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి డాక్టర్ హరీష్, GSI అధికారులు తప్లీయాల్, భట్టాచార్య, శైలేంద్ర, లక్ష్మణ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య తదితరులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్‌ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు