అచ్చంపేట, అక్టోబర్ 8 : అంగన్వాడీ టీచర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని మారుతీనగర్‌లో 17వ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు రోజూవారీగా అందించే పౌష్టికాహారం తదితర రికార్డులను పరిశీలించారు. బాలింతలు, గర్భిణులకు అందిస్తున్న సేవల గురించి సీడీపీవో దమయంతి, అంగన్వాడీ టీచ ర్ సంతోషిని అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఎలాంటి పౌష్టికాహారం అందిస్తున్నారు.. అందరికీ బాలామృతం ఇస్తున్నారా అని ఆరా తీశారు. బరువు తక్కువ ఉన్న 68మంది పిల్లలను ఏవిధంగా పర్యవేక్షణ చేస్తున్నారని ప్రశ్నించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. వైద్యసిబ్బందిని సమన్వయం చేసుకొని గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య జాగ్రత్తలు సూచించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నెరవేర్చేవిధంగా అధికారులు, అంగన్వాడీ టీచర్లు పని చేయాలని సూచించారు. అలాగే హజీపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో పాండునాయక్, తాసిల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.