అచ్చంపేట, ఆగస్టు 8: మైదాన ప్రాంతంలోని గ్రామాలకు భిన్నంగా.. అటవీప్రాంతంలో బాహ్యప్రపంచానికి దూరంగా ప్రకృతిని నమ్ముకొని తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు ఆదివాసీ చెంచులు. వారి జీవనవిధానం, ఆహారపు అలవాట్లు విభిన్నంగా ఉంటాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఉమ్మడి రాష్ట్రంలో చెంచుల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జీవన సరళిలో క్రమంగా మార్పులు వస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న అప్పాపూర్ చెంచుపెంట ప్రత్యేక గ్రామ పంచాయతీగా మారింది. అప్పాపూర్ పంచాయతీ చుట్టూ ఉన్న 12 చెంచు పెంటలను కలిపి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీంతో అక్కడున్న చెంచులు కలిసి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులుగా ఎన్నికై స్వయం పాలన చేసుకుంటున్నారు. ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు కావడంతో చెంచు పెంటలను చెంచులే అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. జనన, మరణాలను అక్కడే రికార్డు చేస్తున్నారు. చెంచు పెంటల్లో ఎలాంటి పనులు కావాలో చెంచులే మాట్లాడుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
ఆదివాసీ జీవన విధానం
అనాధిగా అడవితల్లినే నమ్ముకొని ప్రకృతిలో లభించే అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. కొండలు, గుట్టలు, ప్రకృతి, బొడ్డు గుడిసెలు, గుంపుచెట్లను నివాస ప్రాంతాలుగా చేసుకొని తరతరాలుగా వాటిపై ఆధారపడి నివసిస్తున్న మూలవాసులు. సమాజంలో అన్ని వర్గాల జనాభా పెరుగుతుంటే చెంచుల జనాభా తగ్గుకుంటూ వచ్చింది. అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో సున్నిపెంటలో ఉన్న ఐటీడీఏను తెలంగాణ ప్రాంతంలోని చెంచులకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో ఐటీడీఏ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తోంది. జీవనోపాధి, రవాణా వ్యవస్థ మెరుగుపర్చడం, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. చెంచుల సంక్షేమం, అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించేందుకు ఇటీవల రూ.6కోట్లు మంజూరు చేసింది. చెంచులు పొట్టిగా, సన్నగా, నల్లగా, ఉంగరాల జుట్టు కలిగి ఉంటారు. ప్రతి కుటుంబం వంశపారంపర్యంగా ఒక భూభాగానికి అధిపతులుగా ఉండి జీవిస్తారు. దట్టమైన అటవీప్రాంతంలో జీవించే చెంచులకు మాత్రం సంపాదనపై ఆసక్తి ఉండదు. ఆటవీ ఉత్పత్తులు సేకరించి జీసీసీలో విక్రయించి వాటితో వచ్చిన డబ్బులతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి జీవనం గడుపుతారు.
చెంచులు పూజించే దేవతలు
బయ్యన్న, పోతరాజు, లింగమయ్య, నాగమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, భౌరమ్మ, మల్లమ్మ, లక్ష్మమ్మ, మైసమ్మ, గోవుల మైసమ్మ, గారెల మైసమ్మ, అంకాళమ్మ తదితర దేవతలను పూజిస్తారు. అడవిలో ఉండే జంతువులనే దేవతలుగా భావిస్తారు. పెద్దపులిని పెద్దమ్మగా, ఎలుగుబంటిని లింగమయ్యగా, అడవిపందిని మైసమ్మగా, పామును ఎల్లమ్మ, నాగమ్మగా, నల్లపోతు జంతువును పోతరాజుగా, అడవి రేసుకుక్కలను బౌరమ్మగా ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. తేనె తీసే క్రమంలో తేనెతెట్టెలో ఉండే తెల్లని తేనె గడ్డను మల్లమ్మగా నమ్ముతారు. చెంచులు ప్రతి గుడిసె, కుటుంబంలో తప్పనిసరిగా శునకాన్ని పెంచుతారు. ఈ శునకాన్ని బౌరమ్మగా భావించడంతోపాటు చీపురుతో కొట్టడం, కాళ్లతో తన్నడం లాంటివి చేయరు. వారి కట్టుబాట్లు, ఇంటిపేర్లు ప్రత్యేకంగా ఉంటాయి. నల్లపోతులు, నిమ్మల, డంసాని, చిగుర్ల, మండ్లి, పిట్టల, చిర్ర, కనుమోని, తోకల, ఉడుతనూరి, కాట్రాజు, బల్మూరి, దాసరి, శీలం, పులిచెర్ల, బూమని, ఉడుతల, ఉడుతనూరి తదితర 30రకాల వరకు వీరి ఇంటి పేర్లు ఉన్నాయి.