మహబూబ్‌నగర్, జనవరి21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీ య భరోసా, రైతు భరోసా అమలు చేసేందుకు అధికారులు తయారు చేసిన నివేదిక తప్పులతడకగా మారడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రా మసభలు రసాభాసగా మారాయి. ఎక్కడికక్కడ గ్రా మస్తుల నిలదీతలతో కొనసాగింది. కొన్నిచోట్ల ప్రజలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. మరికొన్ని చోట్ల పోలీసు బందోబస్తు మధ్య గ్రామసభలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చి న హామీ మేరకు దాదాపు 13నెలల తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెబుతూ ఈనెల 26 నుంచి శ్రీకారం చుట్టనుండడంతో.. గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సభలోని లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పినప్పటికీ గతంలో ప్రజాపాలనలో భాగంగా ఇంటింటి సర్వేలో వివరాలు సేకరించారు. అరకొర వివరాలతో ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాలను గ్రామసభల్లో ఆమోదింపజేసేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నం విఫలమవుతున్నది. మంగళవా రం నుంచి నాలుగు రోజులపాటు కొనసాగుతున్న గ్రామసభల నిర్వహణ ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఉమ్మడి జిల్లాలో గ్రామసభలు ఆందోళనలు.. నిలదీతల మధ్య కొనసాగాయి. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గ్యారెంటీలన్నీ కాంగ్రెస్ కార్యకర్తలకే.. అం టూ కార్యకర్తలు అధైర్య పడొద్దని తాము సంతకం పెడితేనే కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అభయమిచ్చారు. నవాబ్‌పేట మండలంలో పంచాయతీ సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రసాభాస
మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండ లం వెంకట్రెడ్డిపల్లిలో ఆత్మీయ భరోసా కింద అసలైన లబ్ధిదారులకు దక్కలేదంటూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు ఎదుట ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదంటూ గ్రామసభను అడ్డుకున్నారు. కృష్ణ మండల కేంద్రంలో రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు రాలేదంటూ మహిళలు నిలదీశారు. కొత్త దరఖాస్తులు తీసుకొని గ్రామసభ ముగించారు. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లెడుదిన్నెలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో గ్రామసభను బహిష్కరించా రు. తర్వాత టెంట్లు వేశాక నిర్వహించారు. గ్రా మం లో ఒకే వ్యక్తికి మూడు రేషన్ కార్డులు మం జూరు చేశారంటూ గ్రామ కార్యదర్శిపై ఫిర్యాదు చేశా రు.
నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్లలో చెంచులకు ప్రాధాన్యం ఇవ్వలేదని అధికారులను నిలదీశారు. జడ్చర్ల మండలం వెలుగొమ్ములలో రైతు రుణమాఫీ రాలేదంటూ ఆందోళన చేశా రు. వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారంలో ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తలకు పంచుతున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నవాబ్‌పేట మండలం కొల్లూరులో గ్రామసభ జరుగుతుండగా.. లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. అక్కడ కాంగ్రెస్ నాయకులు కలగజేసుకొని మాట్లాడడంతో లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. అదే గ్రామానికి చెంది న పంచాయతీ కార్మికుడు యాదయ్యపై చేయి చేసుకున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలో కూడా గ్రామసభలు రసాభాసగా మారాయి.
ఇందిరమ్మ ఇండ్లపై గందరగోళం
పాన్‌గల్, జనవరి 21: మండలంలోని అన్నారంలో నిర్వహించిన గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గ్రామస్తులు గందరగోళం సృష్టించారు. గ్రామసభలో ప్రత్యేకాధికారి డాక్టర్ సురేశ్ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతు ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల పేర్లు చదివి వినిస్తుండగా పేర్లురాని వారు అడ్డు తగిలారు. సభలో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లపై చర్చ జరిగింది. అర్హత ఉన్న తమకు ఎందుకు లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తలకే జాబితాలో అవకాశం కల్పిస్తారా? అని గ్రామస్తులు ప్ర శ్నించారు. తప్పులతడకగా ఉన్న జాబితాలో అనర్హులను తొలగించి అర్హులకు అవకాశం కల్పించాలని అరగంటకుపైగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను చింపివేసి గ్రామసభను బహిష్కరించారు.
మాదిగలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా..?
అమ్రాబాద్, జనవరి 21: పదర మండలంలోని ఉడిమిళ్లలో తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని మాదిగలు అధికారులను నిలదీశారు. గ్రామంలో 300లకు పైగా మాదిగ వర్గానికి చెందిన వారు ఉన్నారని ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కు దరఖాస్తు చేసుకుంటే ఒక్క ఇల్లు కూడా మాదిగలకు ఇవ్వలేదని ఆరోపించారు. అచ్చంపేట నియోజకవర్గానికి మాల కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉండడంతో కేవలం ఎస్సీ మాలలకు మాత్రమే ఇండ్లను మంజూరు చేశారని, మా దిగలు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు కారా..? అని అధికారులను ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఇన్‌చార్జ్జి పంచాయతీ కార్యదర్శి మాతృ, డీటీ బీస్వనాయక్ మాదిగలకు తెలిపారు.
ఇవేం గ్రామసభలురా.. బాబు..!
పెదవి విరుస్తున్న కాంగ్రెస్ నాయకులు
గద్వాలటౌన్, జనవరి 21: ఇవేం గ్రామసభలురా బాబు.. సీఎం రేవంత్‌రెడ్డి ఈ సభ లు ఎందుకు పెట్టాడో.. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రశ్నలు వేసే ప్రజలకు సమాధానాలు చెప్పలేక పోతు న్నాం.. ఇదేం కర్మరా నాయనా అంటూ కాం గ్రెస్ కౌన్సిలర్లు.. నాయకులు ప్రభుత్వ తీరు పై పెదవి విరుస్తున్నారు. మంగళవారం గద్వాల మున్సిపాలిటీలోని 8వార్డుల్లో సభ లు నిర్వహించారు. మిగిలిన మూడు రోజులపాటు రోజుకు పదివార్డుల చొప్పున ఎంపిక చేసి సభలు నిర్వహిస్తారు. అయితే సభలో కేవలం ప్రజల నుంచి దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతున్నది. ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు పనిరాకవా.. ఈ దరఖాస్తులైనా పనికి వస్తాయా మూలన పడేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
హామీల అమలుపై తిరుగుబాటు
అమరచింత, జనవరి 21: మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో చైర్పర్సన్ మంగమ్మ, కమిషనర్ నూరుల్‌నజీబ్, మండలంలోని చింతరెడ్డిపల్లి, ఈర్లదిన్నె, ధర్మాపూర్‌లో డీపీవో సురేశ్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీవో నర్సింహయ్య ఆధ్వర్యంలో నిర్వహించి గ్రామసభల్లో సంక్షేమ పథకల అందజేతకు అనర్హుల పేర్లను ఎంపిక చేశారని ఆయా గ్రామాల, వార్డుల్లో అధికారులను నిలదీశారు. అర్హుల జాబితా లో కాంగ్రెస్‌పార్టీ నాయకులు తమకు ఇష్టమైన వారిని ఎంపిక చేశారని అధికారులను ని లదీశారు. ఈర్లదిన్నె గ్రామసభలో రైతు శివారెడ్డి తాను రూ. లక్షా 60వేలు క్రాప్‌లోన్ తీసుకున్నా మాఫీ వర్తించలేదని గ్రామసభలో అధికారులను నిలదీయగా.. చాలా మంది రైతులు మద్ద తు తెలిపి అధికారులతో వాధించారు.
రుణమాఫీపై నిలదీసిన రైతులు
మిడ్జిల్, జనవరి 21: మండలంలోని వెలుగోముల, వేముల, దోనూర్, బైరంపల్లి, సింగందొడ్డిలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభల్లో ప్రజలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్, తాసీల్దార్ రాజు, ఎంపీడీవో గీతాంజలి, ఏవో సిద్ధార్థ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాకొండలో గ్రామసభను అడ్డుకున్న గ్రామస్తులు
మరికల్, జనవరి 21 : మండలంలో మంగళవారం పల్లెగడ్డ, తీలేరు, రాకొండ, మరికల్లో గ్రామసభలు నిర్వహించారు. మరికల్లో జరిగిన గ్రామసభలో గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నాయకులే ఎట్లా ఉంటారని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా ఇందిరమ్మ కమిటీలను ఎన్నుకోవడం తగదన్నారు. పల్లెగడ్డ, తీలేరులో గ్రామసభ సాఫీగా సాగింది. రాకొండలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, ఒకే కుటుంబంలోని వారికి రెండు, మూడు ఇండ్లు వచ్చాయని గ్రామస్తులు, మహిళలు ఆందోళన చేశారు. అర్హులకు రాని ఇండ్లతో ఈ గ్రామసభలను ఎందుకు నిర్వహిస్తారని, గ్రామసభను అడ్డుకోవడంతో మరికల్ ఎస్సై రాము గ్రామానికి చేరుకొని పోలీసు పహారా మధ్య గ్రామసభను జరిపించారు.
అధికారులు పక్కా సమాచారంతో రావాలి
ఇటిక్యాల, జనవరి 21: ప్రభుత్వ పథకాలకు అర్హులైన పేదలను గుర్తించేందుకు అధికారులు స్పష్టమైన సమాచారంతో గ్రామసభలను నిర్వహించాలని పెద్దదిన్నె గ్రామస్తులు గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన అధికారులను నిలదీశారు. ప్రభుత్వం అమ లు చేస్తున్న నాలుగు పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మండలంలో పెద్దదిన్నె, చాగాపురం, సాతర్ల, మండల కేంద్రంలో మంగళవారం గ్రామభలను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దదిన్నెలో నిర్వహించిన గ్రామసభలో లబ్ధిపొందుతున్న వారికే మళ్లీ లబ్ధి చేకూరేలా జాబితా ఉందని, ఎకరాలు భూమి ఉన్నవారికి గ్రామంలో రేషన్‌కార్డులు ఉన్నాయని పేదలు దరఖాస్తున్న చేసుకొన్న వారిపేర్లు ప్రస్తుత జాబితాలో లేవ ని అధికారులపై మండిపడ్డారు. ఇటిక్యాలలో జేసీ లక్ష్మీనారాయణ పాల్గొని పథకాల అమలుపై అపోహలను నివృత్తి చేశారు.
రంగాపూర్, కోనేటిపూర్లో..
వంగూరు, జనవరి 21: మండలంలోని వంగూరు, కొండారెడ్డిపల్లి, కోనేటిపూర్, రంగాపూర్‌లో మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. కొండారెడ్డిపల్లి గ్రామసభకు ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరై మాట్లాడారు. రంగాపూర్‌లో కాంగ్రెస్‌లోనే ఓ వర్గం ప్రభుత్వానికి అనుకూలంగా, మరోవర్గం వ్యతిరేకంగా అధికారులపై విరుచుకుపడ్డారు. కోనేటిపూర్లో 9 ఇండ్లు మంజూరు కాగా వారిలో గ్రా మంలో లేని వారితోపాటు ఇల్లున్న కాంగ్రెస్ వారికి మంజూరు కావడంతో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులను చుట్టుముట్టిన ప్రజలు
హన్వాడ, జనవరి 21: మండలంలోని వేపూర్, దాచక్‌పల్లి, టంకర, గొండ్యాల, కొనగట్టుపల్లితోపాటు వివిధ గ్రామాల్లో గ్రామసభ నిర్వహించారు. వేపూర్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆనంద్ మాట్లాడుతూ.. రైతుభరోసా 5ఎకరాలా, 10ఎకరాలకు ఇస్తారో రైతులకు ముందుగా చెప్పాలని అధికారులను నిలదీశారు. టంకర, గొండ్యాల, కొనగట్టుపల్లి, ఇబ్రహీంబాద్‌లో ప్రతిఒక్కరికీ రేషన్‌కార్డులు అందించాలని, రైతు భరోసా ఇవ్వాలని అధికారుల దృష్టి తీసుకొచ్చారు. వేపూర్, దాచక్‌పల్లి గ్రామస్తులు రేషన్‌కార్డుల కోసం అధికారులను చుట్టుముట్టారు. ఇబ్రహీంబాద్, టంకరలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.