Palem | బిజినేపల్లి, మార్చి 8 : వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ ప్రణాళికలను సిద్ధం చేయాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ నిర్వహించిన దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశం వానకాలం, యాసంగి 2025-26 సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణ పరిధిలోని 11 జిల్లాల్లో వరి, పత్తి, వేరుశనగ, మొక్క జొన్న, కంది పంటలు సాగు చేయడం జరుగుతుందని, ప్రాంతీయ పరిశోధన కేంద్రాలు నిరంతరం పరిశోధనలు చేస్తూ మేలు రకం పంటలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. పాలెంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఆముదం, కంది, జొన్న, వేరుశనగతో పాటు చిరుధాన్యాలపై పరిశోధనలు జరుగుతున్నట్లు, తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కంది, కుసుమ, యాసంగి జొన్న పంటలపై పరిశోధనలు జరుపుతున్నట్లు, కంప సాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వరి పంటపై పరిశోధన నిర్వహిస్తున్నట్లు వివరించారు. తాండూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేసిన కంది పంటకు భౌగోళిక గుర్తింపు లభించిందని తెలియజేశారు.
మేలు రకం పంటలను రైతులకు అందించాలని సరైన యాజమాన్య పద్ధతులను సకాలంలో రైతులకు తెలియజేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు నిరంతరం అధిక దిగుబడి నుంచి, ఆరోగ్యకరమైన విత్తనాలను రైతులకు అందించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. పంటలకు వచ్చే తెగులు, వైరస్ బ్యాక్టీరియా వంటి వివరాలను రైతులకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విత్తనోత్పత్తి చేస్తున్న ప్రాంతీయ పరిశోధన కేంద్రాల సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనోత్పత్తి సాధిస్తూ, ఎరువుల వాడకం, కంపోస్టు ఎరువుల తయారీ శాస్త్రీయ పరిజ్ఞానం గురించి తెలిసేలా సదస్సు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
ఈ సమావేశంలో ప్రాంతీయ పరిశోధన సంచాలకులు బలరాం, ఉప సంచాలకులు సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.