అయిజ/వడ్డేపల్లి, మే 10 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి అమలు చేయని మోసకారి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మతంపేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీని కూడా మట్టి కరిపించాలని కోరారు. శుక్రవారం అయిజలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికహక్కు లేదన్నారు. గురుకులాల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్‌కు వేలాది మంది విద్యార్థులకు చక్కటి విద్యనందించిన ఘనత ఉందన్నారు. నడిగడ్డ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. అలంపూర్‌కు చెందిన ఆర్ఎస్పీకి నియోజకవర్గం నుంచి 50వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
నేతలను నిలదీయాలి
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా జీవించారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. తాగు, సాగునీటి ఇబ్బందులతోపాటు కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎ ప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మరోసారి మోసపోవద్దని, ఆర్ఎస్పీని గెలిపిస్తే కేంద్రంతో కొట్లాడి పరిశ్రమలు, వి ద్యాసంస్థల స్థాపనకు కృషి చేస్తారన్నారు. అంతకుముం దు శాంతినగర్‌లో వడ్డేపల్లి, రాజోళి మండలాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్ర హ్లాదరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, వైస్ చైర్మన్ నర్సింహులు, సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, వడ్డేపల్లి, రాజోళి మండలాలకు చెందిన మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులుతోపాటు నాయకులు అజయ్‌కుమార్, జగదీశ్వర్‌రెడ్డి, రోశన్న, గోపాల్, స్వాములు, తి రుమల్రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్, మన్నెపురెడ్డి, భరత్, ధర్మ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క గ్యారెంటీ అమలు కాలేదు
కాంగ్రె స్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా అన్నారు. శుక్రవారం ఉండవెల్లిలో బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేయి గుర్తుకు ఓటేస్తే శఠగోపం పెట్టినట్లేనని ఎద్దేవా చేశారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు చూసి విసుగు చెందారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపారని గుర్తు చేశారు. అబద్ధాలు, మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు నెలల్లోనే ప్రజలను అరిగోస పెడుతున్నదని ఆరోపించారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ గారడీ మాటలు నమ్మవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి అలంపూర్ బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పార్లమెంట్‌కు పంపించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మానవపాడు, వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోనూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్‌రెడ్డి, శేషిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఆశీర్వదించండి.. అండగా ఉంటా..
అలంపూర్ బిడ్డగా ప్రజాసేవ చేసేందుకు మీ ముందుకొచ్చాను. ఈ ఎన్నికల్లో నన్ను ఎంపీగా ఆశీర్వదిస్తే మీకు అండగా ఉండి సేవ చేస్తా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి సెగ్మెంట్లో అత్యాధునిక సౌకర్యాలతో విద్యాసంస్థలను స్థాపించి వేలాదిమంది పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చూస్తా. ఉద్యోగ బాధ్యతల్లో ఉండగానే ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన నాకు ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే మరింత సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యమాలు, దీక్షలు చేసి సాధించుకున్న జోగుళాంబ గద్వాల జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్‌ను తెలంగాణ నుంచి తరిమిట్టాలి.
– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి