Nagar Kurnool FRO | నాగర్ కర్నూల్: అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అటవీ శాఖ నాగర్ కర్నూల్ రేంజ్ అధికారి దేవరాజు అన్నారు. నాగర్ కర్నూల్ అటవీశాఖ ఆధ్వర్యంలో వనదర్శిని కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులను అటవీ శాఖ సఫారీ వాహనంలో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులను అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరులోని విహార స్థలాలైన ఫరహాబాద్, ఆక్టోపస్ వ్యూ పాయింట్ల వద్ద సందర్శనకు తీసుకెళ్లారు. అటవీ విభాగం నిర్వహిస్తున్న కార్యక్రమాలైన అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, వృక్ష సంపద పరిరక్షణ, పెంపుదల వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన వారిలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, వైస్ ప్రిన్సిపాల్ వనిత, ఉమెన్ ఎంపవర్మెంట్ అధికారి రమాదేవి, అధ్యాపకులు దశరథం, ముజఫర్ ఉన్నారు.