జడ్చర్లటౌన్, డిసెంబర్ 26: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణించేందుకు నాబార్డ్ ప్రోత్సాహం అందిస్తుందని నాబార్డ్ ఏజీఎం శ్రీనివాస్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ మహిళా సమాఖ్య భవనంలో ఇందిరా ప్రియదర్శిని ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం టై అండ్ డై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాబార్డ్ ఏజీఎం హాజరై 15రోజుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు రాష్ర్టాల్లో టై అండ్ డై (దుస్తులకు వివిధ రంగులు అద్దటం) శిక్షణ పొందిన మహిళలు సొంతగా ఇండ్లలోనే టై అండ్ డై చేసి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు. శిక్షణ కాలంలో రూ.750 ైస్టెఫండ్తోపాటు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన ప్రతిఒక్కరూ ఇండ్లలోనే యూనిట్‌ను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. అదేవిధంగా నాబార్డ్ ఎల్డీఎం భాస్కర్ మాట్లాడుతూ శిక్షణ పొందిన వారు యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించేందుకు సహకరిస్తామన్నారు. మహిళలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ సారిక, ఇందిరా ప్రియదర్శిని ఉమెన్స్ వెల్ఫేర్ సంస్థ నిర్వాహకురాలు గోవర్ధిని, ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ కిరణ్‌కుమార్, కౌన్సిలర్ చైతన్య, మహిళా సంఘం సభ్యురాలు సరిత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.