జడ్చర్లటౌన్, మార్చి 15: జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. బృందం చైర్మన్ డాక్టర్ రిచాచోప్రా నేతృత్వంలో సభ్యులు డాక్టర్ కైలాశ్అగర్వాల్, ఆంటోనీరాజ్ పర్యటించారు. మొదటగా ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ ఆధ్వర్యంలో న్యాక్ బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ బొటానికల్ గార్డెన్లో న్యాక్ బృందం సభ్యులు మొక్కలు నాటి నీళ్లుపోశారు. అనంతరం కళాశాలలోని అన్ని విభాగాలను పరిశీలించారు. కళాశాలలో బోధన, సదుపాయాలు, తెలంగాణ బొటానికల్ గార్డెన్, తెలంగాణ స్టేట్ హెర్బేరియం, బయోడైవర్సిటీ కేంద్రం తదితర అంశాలను ప్రిన్సిపాల్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అలాగే పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీతో న్యాక్ బృందం సమావేశమై కళాశాల స్థితిగతులను తెలుసుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు వృత్తిపరంగా తమ అనుభవాలను కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పూర్వవిద్యార్థుల కమిటీ చైర్మన్ రామ్మోహన్, ప్రధానకార్యదర్శి రవిశంకర్‌తోపాటు బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య న్యాక్బృందంతో మాట్లాడారు. పూర్వవిద్యార్థుల సంఘం చేస్తున్న సహకారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రస్తుత విద్యార్థులతో మాట్లాడి కళాశాలలో జరుగుతున్న బోధనపై అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వరకు న్యాక్ బృందం పరిశీలన కొనసాగింది. గురువారం కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలు, సాంస్కృతిక విభాగాలకు సంబంధించిన విషయాలపై న్యాక్ బృందం పరిశీలించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ తెలిపారు.