కోడేరు, జనవరి 27 : నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె గ్రామాల మీదుగా బీటీ రోడ్డు నిర్మించాలని ముత్తిరెడ్డిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ముత్తిరెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శరత్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ముతిరెడ్డిపల్లికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో దవాఖానలకు తీసుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ రోడ్డు కారణంగా సమయానికి దవాఖానకు తీసుకువెళ్లలేక పలువురు మృతువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని కొన్నేండ్ల నుంచి అధికారులు ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆర్అండ్బీ డీఈ రమాదేవి వారం రోజుల్లో గ్రామంలో బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు దీక్ష విరమించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.