కల్వకుర్తి, ఆగస్టు 28 : అబద్ధానికి మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం డిమాండ్ చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో బు ధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించిన హెల్ప్‌డెస్క్‌ను మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఏసీసీఎస్ చైర్మన్ తలసాని జనార్ధన్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ షాహెద్తో కలిసి చైర్మన్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టినప్పుడు అక్ర మం, అమానుషం, పేదల రక్తాన్ని తాగుతారా అంటూ ఉత్తమ్, వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి గొప్పలు మాట్లాడారన్నారు. ఎల్ఆర్ఎస్కు డబ్బులు చెల్లించవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచితంగా స్థలాలు, లేఅవుట్లు క్రమబద్దీకరిస్తామని ప్రచారం చేసిందన్నారు.
తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్తో వేల కోట్లు ఖజానాకు మళ్లించేందుకు సిద్దమైందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్తో ఖజానాను నింపుకొనేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షం లో ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సైదులుగౌడ్, బావండ్ల వెంకటేశ్, భోజిరెడ్డి, మనోహర్‌రెడ్డి, శ్రీనివాసులుతోపాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.