మహబూబ్‌నగర్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు సమీక్ష పేరుతో సచివాలయంలో హల్చల్ చేశారు. సీఎంను భారీ నీటిపారుదల శాఖ మంత్రిని కలిశారు. రెండున్నరేండ్లు గడిచిన పాలమూరు ఎత్తిపోతల పథకంలో తట్టెడు మట్టి తీయకపోవడంపై ఇటీవల ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేసి రైతులు, జిల్లా ప్రజలను ఏకతాటిపై తీసుకొస్తామని అల్టిమేట్ జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు దిగొచ్చి ఎత్తిపోతలపై ఎట్టకేలకు సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ నేతల ప్రణాళికలతో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కడ కేసీఆర్‌కు పేరు వస్తుందో అన్న అక్కస్సుతో ఈ పథకాన్ని పడావు పెట్టి.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజాగా రైతులు, ప్రజలను ఏకం చేసే విషయంగా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించడంతో అధికార పార్టీ నాయకులు బెంబేలెత్తిపోయారు. ఈ పథకంపై సమీక్ష నిర్వహించాలని సీఎంను భారీ నీటిపారుదల శాఖ మంత్రిని వేడుకున్నా, పీఆర్ఎల్ఐ పథకాన్ని చేపట్టకపోవడంపై కాంగ్రెస్ సర్కారుపై రైతులు గుర్రుగా ఉన్నారు. ఇంకోవైపు ఆ పార్టీకి చెందిన కొందరు అసమ్మతి నేతలు మహబూబ్‌నగర్ జిల్లా వేదికగా పెండింగ్ ప్రాజెక్టుల సాధన కమిటీ పేరుతో ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు.
అంతేకాకుండా పాలమూరును పక్కనపెట్టి ఈ పథకంలోనే ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీళ్లు తీసుకుపోవడాన్ని వీళ్లంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల కార్యాచరణ ఏర్పాటు చేసి ఏకంగా జిల్లా మంత్రులను కలిసి వచ్చారు. దీంతో ఎక్కడ కాంగ్రెస్ సర్కారుపై ఉమ్మడి జిల్లాలో వ్యతిరేకత వస్తుందో అని భయపడి హడావుడిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చాంబర్లో సమీక్ష చేపట్టారు. అదే సచివాలయంలో ఉన్న సీఎంను కలిసి పీఆర్ఎల్ఐతో పాటు ఇతర జిల్లా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఇరిగేషన్ అధికారులు లేకుండానే సమీక్ష?
పాలమూరు పథకంపై వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తు న్న బీఆర్ఎస్కు భయపడి కాంగ్రెస్ నేతలు హడావుడిగా మంగళవారం సచివాలయంలో నీటిపారుద ల శాఖ మంత్రి చాంబర్లో భేటీ అయ్యారు. పీఎల్ఆర్ఐపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు నీటిపారుదల శాఖ అధికారులు లేకుండానే సమీక్ష నిర్వహించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో ఈ పథకం చేపట్టడంపై పూర్తిస్థాయిలో అధికారులతో కలిసి సమీక్ష చేయాల్సి ఉండగా కేవలం తూతూ మంత్రంగా మంత్రులు, ఎమ్మెల్యేలను తీ సుకొని కలిశారు. ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశించినట్లు, సర్కారు చిత్తశుద్ధితో ఉందని ప్రకటించారు. వాస్తవంగా ఈ సమీక్షలో పాలమూరులో కేవలం ఐదు, పది నిమిషాల చర్చ మాత్రమే జరిగిందని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని సమస్యలు ఇతర అంశాలను మాత్రమే చర్చించినట్లు సమాచారం. ఈ పథకం పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు పనులు వాటిపై ఆరా తీయకుండానే కేవలం పైపైకి సమీక్ష చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు.
భూసేకరణ పెండింగ్ పనులపై చర్చ..
రాష్ట్ర సచివాలయంలో పాలమూరు పథకంపై సమీక్ష నిర్వహించినట్లు ఏకంగా ప్రభుత్వ అభివృద్ధి తన వాట్సాప్ గ్రూపులో మీడియాకు సమాచారం అందించింది. సమీక్ష పూర్తయ్యాక ముక్తసరిగా ఇందులో వివరాలు ఉన్నాయి. ఆ తర్వాత సీఎంను, మంత్రులు జూపల్లి, శ్రీహరితోపాటు ప్రభుత్వ విప్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో కలిశారు. వారంతా సీఎంకు వినతిపత్రం అందించగా.. అందులో ఏముందో కూడా మీడియాకు వివరించలేదు. అయితే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర చేపట్టడం.. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తుండడంతో హడావుడిగా ఈ సమీక్ష పేరుతో సీఎంను, ఉత్తమ్‌ను కలిసి వచ్చినట్లు అ యింది.
ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలపై రాజకీయ విమర్శలకు దిగారు. పథకంలో ఇంకా ఎంత భూమి సేకరించాలి..? ఎన్ని కోట్ల పరిహారం ఇవ్వాలి..? పెండింగ్ పనులకు ఎన్ని కోట్లు అవసరం పడతాయి..? ప్రభుత్వం తక్షణంగా ఎన్ని కోట్లు విడుదల చేస్తుందో? స్పష్టంగా పేర్కొనకపోవడం చూస్తుంటే ఇది ఉత్తుత్తి సమీక్ష లాగే అర్థమవుతోంది. అంతేకాకుండా అధికారులతో నివేదికలు తెప్పించకుండానే ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి సమీక్ష పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
నార్లాపూర్-ఏదుల మధ్య ప్రధాన కాల్వపై స్పష్టతేదీ?
పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రధాన భాగమైన నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య హై లెవెల్ కెనాల్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 75 శాతం కాల్వ పనులు పూర్తయ్యాయి. కేవలం 25 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కాల్వ పూర్తయితే కృష్ణానది నుంచి నేరుగా నీళ్లను నార్లాపూర్ కంపోజ్ నుంచి లిఫ్ట్ చేసి అక్కడి రిజర్వాయర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ఈ కాల్వ ద్వారా లేరుగా గ్రావిటీలో ఏదుల పంప్ హౌస్‌కు చేరనున్నది.
ఇక్కడి నుంచి పంపించేసి ఏదుల రిజర్వాయర్‌లోకి నీళ్లను తీసుకెళ్తారు. అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉదండాపూర్ పంప్ హౌస్ పనులు పూర్తయ్యాయి. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వేన రిజర్వాయర్లను పూర్తి చేశారు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు మాత్రం ఇంకా కొద్ది శాతం మేరకు మిగిలి ఉన్నాయి. ఈ ఐదు రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి ఉంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటికి సాగునీటికి సమస్య ఉండేదే కాదు.
ఈ రిజర్వాయర్లలో మొత్తం 60 నుంచి 70 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంది. పాలమూరు జిల్లా మరో జల భాండాగారంగా మారుతుండేది. అయితే సర్కారు రెండున్నరేండ్ల నుంచి ఈ ఎత్తిపోతల పథకంపై సమీక్షలు తప్పా ఒక్క పని కూడా ప్రారంభించలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో వాళ్లంతా ఆయా సైట్ల నుంచి మిషనరీని, లేబర్‌ను తీసుకొని ఎప్పుడో వెళ్లిపోయారు. తిరిగి ప్రభుత్వం పనులను చేపట్టే అవకాశాలు లేకపోవడంతో అధికారులు వచ్చిపోతున్నారు తప్పా ఎలాంటి పనులు ముందుకు సాగడం లేదు. నిధులపై స్పష్టత లేకుండా.. పెండింగ్ పనులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియకుండా.. చేసిన సమీక్ష అభాసు పాలవుతోంది.
పాలమూరు ప్రజలను మోసం చేసిన సీఎం
– శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి
ఉమ్మడి జిల్లాలో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు పథకాన్ని రేవంత్ సర్కారు కక్షపూరితంగా పడావు పెట్టింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లవుతున్నా తట్టెడు మట్టి తీయలేదు. ఈ జిల్లాకు చెందిన రేవంత్సీఎంగా ఉన్నా ప్రయోజనం సున్నా.. పీఆర్ఎల్ఐ పనులు కేసీఆర్ హయాంలోనే 90 శాతం పూర్తి చేశాం. కేవలం 10 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కాల్వల టెండర్లు పిలిచి ఖరారు చేశాం. కాంగ్రెస్ సర్కారు రాగానే వాటిని రద్దు చేసింది. ఆ టెండర్లను నిర్ధారించి పనులు పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఉమ్మడి జిల్లాలో నాలుగు రిజర్వాయర్లలో జలకళ ఉట్టిపడేది. ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందోనన్న భయంతో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి పూర్తిచేసి ఉండేది.
రైతులు, జిల్లా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేమంతా ఏకమై ప్రాజెక్టు చేపట్టాలని సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించాం.. కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రకటించగానే సర్కారు భయపడి హడావుడిగా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించింది. అధికారులు ఎవరూ లేకుండా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రా జెక్టుపై ఏం అవగాహన ఉందని సమీక్షలో కూర్చున్నారో? జవాబు చెప్పాలి. ఒక్కరో జు ప్రాజెక్టును విజిట్ చేసినా పాపాన పోలేదు. సమీక్ష నిర్వహించామని ప్రజల ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్‌హౌస్, రిజర్వాయర్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. వచ్చే నెలలో పాదయాత్ర చేసి సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తాం.