వనపర్తి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : కొల్లాపూర్ మామిడి.. ఈ పేరు చెబితే నోరూరాల్సిందే.. రుచికరమైన పండ్లకు ఈ ప్రాంతం పేరొందింది. నియోజకవర్గంలో ఎక్కడా చూసినా మామి డి తోటలే కనిపిస్తాయి. ఈ ప్రాంత పండ్ల కోసం ఎం దరో ఎదురుచూస్తుంటారు. విదేశాలతోపాటు జాతీ య స్థాయిలో ఇక్కడి పండ్లు గుర్తింపు పొందాయి. బుట్టలు, బాక్స్‌ల్లో ఇక్కడి నుంచి పండ్లను రైతులు ఎగుమతి చేస్తుంటారు.
చూసేందుకు పచ్చని వర్ణంలో నిగనిగలాడుతుం ది. రుచిలో అమృతాన్ని తలపిస్తున్నది. పోషకాల్లో యాపిల్ కంటే ఏమాత్రం తీసిపోదు.. అందుకే కొల్లాపూర్ మొదలు దేశవిదేశాల్లోని ప్రజలు ఈ పం డు రుచి కోసం పరితపిస్తారు. కొల్లాపూర్ మామిడి అంటేనే కొత్త బంగారంలా భావిస్తారు. నాణ్యతలో నూ ప్రత్యేకతను సంతరించుకున్నది. ఇందుకు కార ణం నియోజకవర్గంలోని నేలలు తోటలకు అనుకూలంగా ఉండడం.. మార్కెట్లో పండ్లకు డిమాండ్ ఉండడంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతారు.
కొల్లాపూర్ మామిడికి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ డిమాండ్ ఉండడంతో ప్రాధాన్యత పెరుగుతుంది. కొల్లాపూర్ మామిడిలో కేసరి, హిమాయత్, మల్లిక, దసేరి, తోతాపురి, మాల్గోవా, నీలంతోపాటు పలు రకాలు ఉన్నాయి. మొత్తం సాగులో 80 శాతానికిపైగా కొల్లాపూర్ మామిడి రకాలే ఉంటాయి. దీన్ని బట్టి వీటికి ఉన్న ప్రాధాన్యత ఇట్టే అర్థమవుతున్నది. ఇక్కడి నేల స్వభావంతో పండ్లు తీపిదనంగా ఉంటాయి. సంస్థానాల కాలం నుంచి వనపర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో మా మిడికి ప్రాధాన్యతనిచ్చారు.
ఇక్కడి వాతావరణ పరిస్థితులతో కాయలు మం చి ఆకారంతోపాటు పరిమాణం కూడా పెద్దగా ఉం టాయి. ఒక్కోటి 200 గ్రాముల నుంచి 500 గ్రా ముల సైజ్‌లో.. గుండ్రని ఆకారం, బంగారం, పసు పు మిశ్రమ వర్ణంతో ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో సుమారు 66,500 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం ఉన్నది. కొత్త జిల్లాల వారీగా.. నాగర్‌కర్నూల్‌లో 36 వేల ఎకరాలు, వనపర్తి జిల్లాలో 16 వేల ఎకరాల్లో తోటలు సాగులో ఉన్నాయి. కొల్లాపూర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో విస్తారంగా ఉన్నాయి. పాలమూరు జిల్లాలో 6 వేలు, నారాయణపేటలో 3,500, జోగుళాంబ గద్వాల జిల్లాలో 4 వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. రాష్ట్రంలోని జన గాం, వరంగల్, ఖమ్మం, వికారాబాద్, మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లోనూ విస్తారంగా సాగవుతున్నది.
కొల్లాపూర్ మామిడి పండ్లకు దేశ, విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉన్నది. సింగపూర్, ఫ్రాన్స్, మలేషియా, యూకే, అమెరికా, సౌదీ, గల్ఫ్ దేశాలకు కొల్లాపూర్ బంగినపల్లి ఎగుమతి అవుతుంటుంది. ఎక్స్‌పోర్టు ఏజెన్సీల ద్వారా నాలుగైదేళ్లుగా విదేశాలకు ఎగుమతి జరుగుతున్నది. అయితే బాగా రంగు, సైజ్, రుచి ఉన్న పండ్లనే పంపిస్తుంటారు. క్వాలిటీ తక్కువగా ఉన్న మామిడి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్తున్నది. వీటితోపాటు దేశంలోని కర్ణాటక, ఢిల్లీ, ఇతర రాష్ర్టాలకు కొల్లాపూర్ మామిడిని పంపిస్తున్నా రు. అంతటి పేరొందిన కొల్లాపూర్ మామిడికి రాబో యే రోజుల్లో మంచి భవిష్యత్ ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది మామిడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సా హం కరువైంది. కేసీఆర్ ప్రభుత్వంలో సెర్ప్ ఆధ్వర్యంలో మామిడి కొనుగోలును చేపట్టి బాసటగా నిలిచింది. రైతుల తోటల వద్దనే కొనుగోలు చేస్తూ కిలోకు రూ.35 నుంచి రూ.45 వరకు అందజేసింది. మార్కెట్లో వీటిని విక్రయించిన అనంతరం వచ్చిన లాభాలను కూడా సెర్ప్ ద్వారా రైతులకు పంపిణీ చేసిన సందర్భాలున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రసుతం ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం.. ప్రకృ తి పరంగా తేనే మంచు, నల్లతామర పురుగు ధాటికి చాలా తోటలు కాపునకు నోచుకోలేదు.
కేవలం సగం తోటలకు మాత్రమే ఈ ఏడాది అనుకూలంగా ఉన్నాయి. వచ్చిన దిగుబడులను రైతు లు నేరుగా విక్రయించారు. ధరలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి.
ఈ ఏడాది మామిడి సీజన్ అంతంత మాత్రంగానే ఉన్నది. అయినప్పటికీ ఒక్క వనపర్తి జిల్లా నుంచే ఈ సీజన్లో 2,400 టన్నుల మామిడి దిగుబడి ఉన్నట్లు ఉద్యానవన శాఖాధికారుల అంచనా.. సీజన్ బాగా లేకపోవడంతో సగం తోటల్లో మాత్రమే కాపు నిలబడింది. ప్రస్తుతం మామిడి కోతలు.. విక్రయాల సీజన్ జోరుగా సాగుతున్నది. ఏప్రిల్ నుంచి మామిడి సీజన్ ప్రారంభం కాగా.. తోటలు అధికంగా ఉన్న జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు కాయలు, పండ్లు తరలుతున్నాయి.
ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగానే ప్రస్తుత మార్కెట్ కొనసాగుతున్నది. ప్రతి రోజూ 200 మెట్రిక్ టన్నుల నుంచి మొదలుకొని అత్యధికంగా 600 మెట్రిక్ టన్నులకుపైగా మామిడి వస్తున్నది. ప్రస్తుత మార్కెట్లో టన్ను మామిడికి రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ధర పలుకుతున్నది. అయితే ప్రారంభంలో కేజీ మామిడి రూ.200 ధర పలకగా.. 20 కేజీల బాక్స్‌కు రూ.4 వేల ధర వచ్చింది. ఈ ధరలు ముందస్తుగా కాత వచ్చిన రైతులకు మాత్రమే అందడంతో ఎక్కువ లాభసాటిగా నిలిచింది.