నారాయణపేట రూరల్, డిసెంబర్ 13 : గురుకులాలు.. వసతి గృహాలు.. పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందించే భోజనాన్ని సైతం విషంగా మారుస్తున్నారు.. కూలి నాలి చేసుకొని మా కష్టం మా పిల్లలకు రావొద్దని సర్కారు బడికి పంపిస్తున్న తల్లిదండ్రులకు ప్రతి రోజూ గుబులే. ఉడికీ ఉడకని అన్నం.. నీళ్ల చారు.. మురిగి పోయిన కూరగాయలతో కూర లు.. కుళ్లిపోయిన కోడిగుడ్లను పెట్టి పేదల విద్యార్థుల పొట్ట కొట్టడమే కాకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో వెలుగు చూసిన ఫుడ్ పాయిజన్ ఘటనలే ఇందుకు నిదర్శనం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో కడుపునిండా నాణ్యమైన భోజనం తిన్న విద్యార్థులు నేడు ఇంటి నుంచే లంచ్ బాక్స్‌లను తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. సర్కారు బడిలో అందించే భోజనంపై నమ్మకం లేక విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారు.
నారాయణపేట గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులు, రాళ్లతో కూడిన మధ్యాహ్న భోజనం వడ్డించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురై శుక్రవారం ఇంటి నుంచే లంచ్ బాక్స్‌లను పంపించారు. 880 మంది విద్యార్థులున్న పాఠశాలలో దాదాపుగా 200మంది లంచ్ బాక్సులతో హాజరైనట్లు అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది.
పాఠశాలలో ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంలో అన్నం సరిగా ఉడకటం లేదు. రాళ్లు, పురుగులు వస్తున్నా యి. ఈ అన్నం తిని కడుపు నొప్పితో బాధపడుతున్నాం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.
– కృష్ణచైతన్య, పదో తరగతి విద్యార్థి, గ్రౌండ్ స్కూల్, నారాయణపేట
పాఠశాలలో రెండు నెలలుగా మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వడం లేదు. గతంలో వారంలో మూడు రోజులు గుడ్లను అందించేవారు. గుడ్లు ఇవ్వడమేమోగానీ నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నాం.
-నర్సింహ, 8వ తరగతి, గ్రౌండ్ స్కూల్, నారాయణపేట