మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లా ను ముసురు ముంచెత్తింది. గురువారం మధ్యరాత్రి నుంచి శుక్రవారం పొద్దస్తమానం కురుస్తూనే ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో దంచికొట్టగా.. మరికొన్న చోట్ల మోస్తరు కురిసింది. వాగులు, వంకలు ఉధృతంగా పారగా.. చెరువులు, కుంటలు మత్తడి దుంకాయి. రహదారులు నీటితో నిండిపో గా.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతంలోని పలు కాలనీలో కుంటలను తలపించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ, ఉండవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి.
ఇండ్లల్లోకి నీరు చేరడంతో బయటకు తోడేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పాలమూరు జలమయైంది. నాలాలు, డ్రైనేజీలు పొంగిపారాయి. లక్ష్మీనగర్ కాలనీలోని పలు ఇండ్లల్లోకి నీరు చేరింది. గడియారం, పాన్ చౌరస్తాలతోపాటు న్యూటౌన్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. అశోక్‌టాకీస్ చౌరస్తా సమీపంలోని అసిస్టెంట్ ఇంజినీర్ కార్యాలయం (ఆపరేష్ టౌన్-1 సెక్షన్) ఆవరణ మడుగులా తయారైంది. దేవరకద్రలోని వివిధ కాలనీలు వర్షపు నీటితో నిండిపోయి ఇండ్ల మధ్యకు చేరాయి. గండీడ్ మండలం పెద్దవార్వల్లో నీరటి అంజయ్యకు చెందిన ఇల్లు కూలిపడింది. పాత మట్టి మిద్దెలు కూలిపోతాయేమోనని బంధువుల ఇండ్లకు వెళ్లి తలదాచుకున్నారు. దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్‌కు వరద పెరగడంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు తెరిచి 2,100 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు సమీపంలో వర్షానికి నీట మునిగింది. అయిజ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన భరత్‌నగర్, బుడగ జంగాల, నర్సింహ్మ, టీచర్స్, ఎస్సీ కాలనీలతోపాటు రంగుపేట, కాళమ్మపేట, తెలుగు పేట చెరువులను తలపించాయి. అయిజ పీహెచ్సీ ఆవరణలో వర్షం నీరు చేరడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు.
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ రెండు సైఫన్లు తెరుచుకున్నాయి. పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలోని రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒక గేటును అధికారులు తెరిచారు. కొత్తకోటలోని పలు ఇండ్లల్లోకి నీరు చేరింది. పంట పొలాల్లో వర్షపునీరు చేరడంతో వేల ఎకరాల్లో కంది, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు.