గద్వాల, జూన్ 3 : నడిగడ్డ ప్రజలు ఆత్మాభిమానం గలవారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా బీఆర్ఎస్ వెంటే ఉండి ఎమ్మె ల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపునకు కృషి చేశారని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా ద వాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రస్తుతం ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు . తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్‌పై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిధుల కోసం కాంగ్రెస్‌పై పోరాటం చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా వర్షా లు కురుస్తున్నాయని అయితే రైతులకు అవసరమైన విత్తనాలు అందించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందన్నారు. గ్రామాల్లో నాయకుల దౌ ర్జన్యాలు ఎక్కువయ్యాయ ని, తమ కార్యకర్తలను వే ధింపులకు గురిచేస్తే సహించమన్నారు.
బీఆర్ఎస్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం నీతి, నిజాయితీ గల కార్యకర్తలు ఉన్నారని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని నడిగడ్డ నాయకులు కృష్ణమోహన్‌రెడ్డితోపాటు అలంపూర్ ప్రజాప్రతినిధులు మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ ప్రజలు వారిని కాదని బీఆర్ఎస్ నాయకులకు పట్టం కట్టడం సంతోషంగా ఉన్నదన్నారు. 2014లో జెడ్పీటీసీగా గెలుపొందిన తర్వాత జెడ్పీ వైస్‌చైర్మన్ కావడానికి కృష్ణమోహన్‌రెడ్డి కృషి చేశారని.. ఇప్పుడు కూడా తనకు టికెట్ ఇప్పించి గెలిపించారని చెప్పారు. తనకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు.. గెలిపించిన నడిగడ్డ ప్రజాప్రతినిధుల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చా రు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీలు రాజారెడ్డి, ప్రతాప్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబర్, జెడ్పీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.