కొల్లాపూర్, ఫిబ్రవరి 28 : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారి చిట్టా పింక్ బుక్‌లో రాస్తామని, సమయం వచ్చిన రోజు వారి సంగతి తేలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్షాలపై దా డులు మానుకొని ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం సిం గోటం గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకొ ని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. సింగోటంలో లింగాకారంలో లక్ష్మీ నర్సింహస్వామి ఉండటమన్నది చాలా ప్ర త్యేకమన్నారు. ఇలాంటి అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్షేత్రం అభివృద్ధికి కేసీఆర్ రూ.17 కోట్లు మంజూరు చేస్తే దేవుడికిచ్చిన డబ్బులను కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించడం దౌర్భాగ్యమన్నారు. ఒక ప్రభుత్వం ఇచ్చిన పథకాలు తర్వాత సర్కారు కొనసాగించాలే కానీ.. కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే ఆలయాభివృద్ధికి జూపల్లి కృషి చేయాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరుపున నిలబడిన ఏ నేత సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టినా.. నిలబడి ప్రశ్నించినా కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక గులాబీ పార్టీ శ్రేణులపై దాడుల పరంపర కొనసాగుతోందన్నారు.
బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యకు గురైనా.. మంత్రి జూపల్లి ఇలాకాలో ఇంకా కేసులో ఎలాంటి పు రోగతి లేదన్నారు. హంతకులకు కొమ్ముగాస్తున్నారే తప్పా ప్రజల పక్షాన మీరు నిలబడింది లేదని విమర్శించారు. జూపల్లి టూరిజం మంత్రిగా కాకుండా టూరిస్టు మంత్రిగా ఉన్నాడన్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చిపోవాలని ఎద్దేవా చేశారు. ఇక్కడ పండే మామిడి దేశవిదేశాలకు ఎగుమతి జరుగుతుందని, కేసీఆర్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బీరం కొల్లాపూర్‌కు మామిడి మార్కెట్ మంజూరు చేయిస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రైతుభరోసా, రుణమాఫీ ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు.
కనీసం ప్రభుత్వం చెప్పిన తేదీలోపు రైతుభరోసా డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. సాతాపూర్‌లో మీటింగ్ కో సం ఫ్లెక్సీలు కట్టిస్తున్న బీఆర్ఎస్ నేత పరమేశ్‌పై దాడి చేశారని, రాష్ట్రంలో ఇదేమి రాజ్యం నడుస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్ గడ్డ మీది నుంచి చెబుతున్నాను.. మేము కూడా పింక్ బుక్ మెయింటనెన్స్ చేస్తున్నామన్నారు. కార్యకర్తలపై, నాయకులపై దాడి చేసిన వారి చిట్టా రాస్తామని.. టైం వచ్చినప్పుడు వారి సంగతి చెబుతామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాశ్‌రావు, ధూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిషన్‌నాయక్ పాల్గొన్నారు.