మహబూబ్‌నగర్ కలెక్టరేట్/అయిజ, మార్చి 13 : జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఘనంగా జరిగాయి. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పండ్లు, బ్రెడ్డును బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కవితదే అన్నారు. బతుకమ్మ పండుగను గ్రామస్థాయి నుంచి దేశ విదేశాల్లోని మహిళలు సైతం నిర్వహించేలా చేశారన్నారు. పోరాటంలో రాణీరుద్రమ.. వీరత్వంలో ఝాన్సీలక్ష్మీబాయి.. ఔదార్యంలో మదర్ థె రిస్సా.. నేర్పించడంలో సావిత్రి బాయిపూలే, న మ్ముకున్న వారికి అండగా ఉంటూ బడుగు, బలహీన వర్గాలకు భరోసానిచ్చే తెలంగాణ బతుకమ్మ, కార్యకర్తలకు ఆత్మ బంధువుగా కవిత నిలుస్తుందన్నారు.
పాలమూరు యూనివర్సిటీలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ పీయూ కన్వీనర్ గడ్డం భరత్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రజానికాన్ని ఏకథాటిపైకి తెచ్చేందుకు కవితక్క బతుకమ్మ వేడుకలను పరిచయం చేసి ఊరువాడలకు ఉద్యమ నినాదాన్ని నింపారన్నారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పార్లమెంట్లో నిత్యం తన గళాన్ని వినిపిస్తూ.. చట్టసభల్లో మహిళలకు 31శాతం రిజర్వేషన్ల బిల్లుపై విస్తృతంగా పోరాడిన ఉత్తమ పార్లమెంట్ అవార్డు గ్రహీత మన కవితక్క అని కొనియాడారు. తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో 46శాతం రిజర్వేషన్లు పెంచాలని సుదీర్ఘ ఉద్యమాలతో ప్రభుత్వానికి బీసీల డిమాండ్లను గుర్తు చేస్తూ ముందుకు సాగారన్నారు. ప్రభుత్వం విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో వేర్వేరుగా అసెంబ్లీలో మూడు బిల్లుల ను పెట్టేవరకు విశ్రమించకుండా ప్రభుత్వం మెడలు వంచి కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయించిన ఘనత కవితమ్మకు దక్కిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు ఆంజనేయులు, తిరుమలేశ్, నరేశ్, మల్లేశ్, లక్ష్మణ్, మహేశ్, నర్సింహులు, జ్యోతి, ప్రేమలత, ఉమామహేశ్వరి, రేణుక తదితరులు పాల్గొన్నారు.