నాగర్ కర్నూల్ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు (ASHA Workers) ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ( MLA’s Camp Office) ముట్టడించారు. అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు.
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే అక్రమ అరెస్టులు పాల్పడుతున్నారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ఆరోపించారు. ఎమ్మెల్యే లేకపోవడంతో ఆఫీసు కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు సంవత్సరాలు కావస్తున్న ఒక రూపాయి కూడా వేతనం పెంచలేదని మండిపడ్డారు. ప్రతి నెల రావాల్సిన పారితోషకాలు రెండు మూడు నెలలైనా రావటం లేదన్నారు.
ప్రతి నెల 5వ తేదీ లోపు పారితోషకాలు అకౌంట్లో వేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మూడు నుంచి నాలుగు నెలలు అవుతున్న పారితోషకాలు పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య , ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ, కృష్ణవేణి, సువర్ణ, కార్యకర్తలు చంద్రకళ, శిరీష, వరలక్ష్మి, విజయనీల అమీనా, లక్ష్మీ, భాగ్యమ్మ, వెంకటమ్మ, మంజుల, గౌరమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.