Mahabubnagar | మహబూబ్ నగర్ అర్బన్ : రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలోని విద్యుత్ భవన్ వద్ద వ్యవసాయ అవసరాలకోసం 20 మంది రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాన్స్ఫార్మర్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులు వేసిన పంటలు ఎండిపోరాదనే ఉద్దేశంతో తాను ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యుత్ అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించానని తెలిపారు.
ఈరోజు 20 మంది రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేస్తున్నామని.. త్వరలో మరికొందరికి ట్రాన్స్ఫార్మర్ లు పంపిణీ చేస్తాం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తు లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులకు, గృహ అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు హన్వాడ మండలంలోని గొండ్యాల లో 132 కెవి సబ్ స్టేషన్ మంజూరు చేశామని తెలిపారు. ఆరు 33/11 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతు సమస్యలను తెలుసుకొనేందుకు ప్రజావాణి తరహా కార్యక్రమం నిర్వహించాలని ఆయన విద్యుత్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ పీవీ రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, విద్యుత్ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.