అయిజ, జనవరి 8 : ఆర్డీఎస్ ఆయకట్టుకు నెట్టెంపాడు ప్రాజెక్టు నీళ్లిచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం అయిజ పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం ఆవరణలో సింధనూర్, కుటుకనూర్, కొత్తపల్లి గ్రామాల రైతులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను కలిసి సాగునీటి విడుదల గురించి చర్చించారు. వానకాలంలో వానలు సమృద్ధిగా కురవకపోవడంతో తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండుకుందని, ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటి విడుదల చేయకపోవడంతో పంటలు పండించలేక పోయామని, వచ్చే వానకాలం నాటికి నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్, లింక్ కెనాల్ పనులు పూర్తి చేసి ఆర్డీఎస్ ప్రధానకాల్వకు డిస్ట్రిబ్యూటర్ 12ఏ వద్ద కలిపితే ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. అలాగే కొత్తపల్లి – సింధనూర్ రోడ్డు, కొత్తపల్లి- లింగపురం రోడ్డు, కుటుకనూర్కు బస్సు సౌకర్యం కల్పించాలని వారిని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రభుత్వం, ఉన్నతాధికారులతో చర్చించి పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టి, సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు అయిజ రైతు సంఘం నాయకులు కూడా నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని కాల్వలు పూర్తి చేసి, మండలానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
క్రికెట్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మె ల్యే విజయుడు,ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆకాంక్షించారు. సోమవారం పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి ప్రాంగణంలో జరుగుతున్న ఐపీఎల్-8 క్రికెట్ పోటీలకు వారు అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధు లు, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
అయిజ రూరల్, జనవరి 8: క్రీడలతో స్నేహ, సోదర భావం పెంపొందుతుం దని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం మండలంలోని యాపదిన్నెలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, రాముడు, సుందర్రాజు, తిప్పన్నతోపాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.