రూరు, అక్టోబర్ 27: అరవై ఏండ్ల గోసలను తీర్చి అందరినీ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీనే, అన్ని ఇచ్చింది కూడా బీఅర్ఎస్ పార్టీనే కాబట్టి అందరూ కారు గుర్తుకే ఓటు వేసి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలబడదామని బీఆర్ఎస్ గద్వాల అబ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గద్వాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి విద్య, వైద్యం, విద్యుత్ రంగాల్లో ప్రగతిని చూపించిన కారుగుర్తకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. శుక్రవారం మండలంలోని పెద్దపాడులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్లకు గ్రామస్తులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. బీంపురం, ఎములోనిపల్లి, రేవులపల్లి, చింతరేవుల, నర్సన్‌దొడ్డి, వామన్పల్లి, జీరబండ, గుడ్డెందొడ్డి, ఉప్పేరు, ఖమ్మంపాడు, గార్లపాడు, ద్యాదొడ్డి, మాల్దొడ్డిలో ప్రచారం చేశారు. వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల పాల్గొని బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ, ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ.. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే.. ప్రతిక్షాలు, పనిలేని, పసలేని ఆరోపణలతో ప్రజల ముందకొస్తూ మనల్ని మభ్యపెట్టి, మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారని, వారిని నమ్మొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు వస్తే కరెంట్ అడగండి, బీజేపీ నాయకులు వస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు ఎవరు పెట్టారని అడగండి, వాళ్లు సమాధానం చెప్పడానికి నీళ్లు నమలడం గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. కాని బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క ఒక్కసారి మన కండ్లతో చూస్తే ఆశ్చర్యపోవడం మన వంతవుతుందన్నారు. ఒక మన ధరూరు మండలానికి అన్నిరకాల సంక్షేమ, అభివృద్ధి పనులకు ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల రూ.312కోట్ల, 28లక్షల, 42వేల, 745లు అంటే నమ్మశక్యం అవుతుందా అని పేర్కొన్నారు. అడ్డమైన మాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులను అడగండి ఈ లెక్కల, ఆ దొంగల పార్టీ అరవై ఏండ్లలోనైనా ప్రజా సంక్షేమం కోసం ఇంతఖర్చు చేసిందా అని దుయ్యబట్టారు.
మన మండలానికి రైతుబంధు రూ.165కోట్ల 72లక్షల 77వేల 217లు, రైతుబీమా రూ.10కోట్ల10లక్షలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.14కోట్ల12లక్షల 22వేల 382లు, ఆసరా పింఛన్లు రూ.89కోట్ల 50లక్షల15వేల 384లు, సీఎంఆర్ఎఫ్ రూ.కోటి 51లక్షల 54 వేల 860లు, కేసీఆర్ కిట్ రూ.3కోట్ల32లక్షల62వేల 500లు, న్యూట్రిషన్ కిట్ రూ.21లక్షల92వేల400లు, ఎస్డీఎఫ్ రూ.70కోట్లు, దళితబంధు రూ.2కోట్ల20లక్షలు, కార్పోరేషన్ లోన్స్ రూ.46లక్షల25వేల467లు, సీడీపీ రూ.కోటి13లక్షలు, సీసీ, బీటీరోడ్స్ రూ.10కోట్ల42లక్షలు, బీఆర్ఎస్ కార్యకర్తల బీమా రూ.8లక్షలు, మనఊరు-మనబడికి రూ.16కోట్ల7లక్షల 42వేలు ఖర్చు చేసింది. ఇన్ని అభివృద్ధి పనుల్లో మనకు అన్నిరంగాలు కలిసి వచ్చాయి. వ్యవసాయం వచ్చింది, విద్య వచ్చింది, వైద్యం వచ్చింది. ఇంత ఖర్చు లెక్కలు కాంగ్రెస్‌కు తెలుసా అడగండి.. ఒకవేళ అబద్ధమైతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని నొక్కి చెప్పారు.
60ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులు కడితే ఆరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. కాలేశ్వరం ఆసియాలోనే పెద్ద ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. ఇవన్నీ ఎట్ల సాధ్యమైనవో అడగండి.. ఆహర్నిశలు కృషి చేయనిదే సాధ్యమైతదా ఆలోచించాలన్నారు. విద్యలో మన నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుతుందని, నీట్ ర్యాంకుల్లో మన వాళ్లే టాప్, టెట్ ఫలితాల్లో మన జిల్లా టాప్, వీటన్నిటినీ గమనించిన కేసీఆర్ మన గద్వాలకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కళాశాలలు, ప్రతి మండలానికి ఇంటర్ కాలేజీ, కేజీబీవీ స్కూళ్లను ఏర్పాటు చేశారని వివరించారు. కాంగ్రెస్‌కు కర్ణాటకలో అధికారమిస్తే అభివృద్ధిలో సున్నా, బీజేపీ దేశంలో అధికారమిస్తే అన్నీ అమ్మేస్తుంది కాబట్టి ప్రజలు గమనించాలన్నారు. అడ్డమైన మాటలకు మోసపోతే మన కంట్లో మనమే పొడుసుకున్నట్లు అవుతుందన్నారు. ఎంత చెప్పినా ఒక్కటే అది కేసీఆర్ ఐనా నేనైనా.. అనవసరంగా మోసపోతే ఆరవై ఏండ్ల గోసకు పోతం, అన్నీ గమనించి ఓటు వేస్తే అభివృద్ధిలో మనమందరం ఉంటాం.. అందులో నీవుంటావు, నేనుంటాను, మన భవిశ్యత్ తరాలుంటాయన్నారు.
రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ మాట్లాడుతూ.. వాల్మీకి బోయలను మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం, గద్వాలలోనైతే డీకే కుటుంబమని అన్నారు. మన చిరకాల స్వప్నం బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం. ఆ బిల్లును కేంద్రానికి పంపితే దొంగసాకులతో కాలాయాపన చేస్తుంది కాబట్టి మనకు అండగా నిలిచిన బీఆర్ఎస్కే, కారు గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు డీఆర్ విజయ్‌కుమార్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఈశ్వరయ్య, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, సర్పంచులు విజయభాస్కర్‌రెడ్డి, రామకృష్ణ, పద్మమ్మ, ప్రభాకర్‌గౌడ్, శివారెడ్డి, రాములమ్మ, మాధవి, మహేశ్వరమ్మ, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు చిట్టెం పురుషోత్తంరెడ్డి, ఉపాధ్యక్షులు భరత్, కృష్ణారెడ్డి, మోనేశ్ మారోజు, చక్రధర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నర్సింహులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.