మహబూబ్నగర్ : ఆయన పేరు అనిరుధ్ రెడ్డి…! అధికార పార్టీ ఎమ్మెల్యే..! సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన అధికార పార్టీలోనే ప్రతిపక్ష నేతలా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల హైడ్రా అక్రమాలను ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావించారు. కబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. కానీ అదే ఎమ్మెల్యే జడ్చర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో 4 ఎకరాల భూమిని కబ్జా చేసి ఏకంగా చెరువుని కబలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న జనంపల్లి దుష్యంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనుచరులు జడ్చర్ల నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల ప్రాపర్టీపై కన్నేశారు. అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగు నెలలకే గుట్టుచప్పుడు కాకుండా కబ్జాకు తెరలేపారు. ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పట్టించుకోవడం లేదు. నల్లకుంటలో 4 ఎకరాల్లో మట్టి పోసి, కాంపౌండ్ కూడా కట్టేశారు. అధికారులు కూడా ఈ అక్రమ భూబాగోతాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంలేదు.
దీనిపై స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేయగా ఆ ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా కబ్జా చేసిన భూమిలో ఎమ్మెల్యే అన్న దుష్యంత్ రెడ్డి పనులు చేస్తున్నారు. ఆ కబ్జా భూమి FTL పరిధిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్లో చెరువుల కబ్జాల గురించి హైడ్రాకి ఫిర్యాదు చేసే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోని నల్లకుంటను తన అన్న కబ్జా చేయడం కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. నీతులు వల్లించే ఎమ్మెల్యే తానే కోట్ల రూపాయల విలువగల చెరువును కబ్జా చేయడంపై జడ్చర్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఎమ్మెల్యే ఏకంగా చెరువునే మింగడం ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి భూ కబ్జా బాగోతం మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.