దేవరకద్ర రూరల్ (చిన్న చింతకుంట), అక్టోబర్ 30 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన దేవరకద్ర నియోజకవర్గ క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావాలని క్రైస్తవులు ఎంతో ప్రార్థించారని గుర్తుచేశారు. యేసు ప్రభువు, ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని చెప్పారు. అనంతరం ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మూడోసారి గెలవాలని పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చిన్నచింతకుంట మండలం గూడూరుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఆల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ ఉషారాణి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడే కరుణాకర్‌రెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సురెందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర, అక్టోబర్ 30 : దేవరకద్రలో సీఎం కేసీఆర్ సభ నవంబర్ 6వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం సభా స్థలాన్ని పరిశీలించారు. దేవరకద్ర ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న దేవస్థాన స్థలంలో సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు.