మహబూబ్‌నగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతన్నలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంటే కేవలం 3 గంటలే చాలని ఉచిత సలహా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. రెండోరోజైన బుధవారం ఉమ్మడి జిల్లాలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళ నలు నిర్వహించారు. రేవంత్.. డౌన్‌డౌన్ అంటూ నినదిస్తూ ఆయన దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. గ్రామాలు, మండల, నియోజకవర్గ, మున్సిపాలిటీ కేంద్రాల్లో కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగాయి. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో నిరసన హోరెత్తగా.. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినదించారు. అలాగే అలంపూర్ చౌరస్తాలోని హైవే-44పై ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై పార్టీశ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. భూమి పుత్రులకు క్షమాపణ చెప్పాలని, వారి జోలికొస్తే ఊరుకోమని.. రేవంత్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
కరెంటు కోసం కాపలా కాసెటోళ్లం..
నేను 30 ఏండ్లుగా వ్యయసాయం చేస్తున్నా. గప్పుడు పగులు 3 గంటలు, రాత్రి 3 గంటల కరెంటు ఇచ్చేటోళ్లు. ఆ కరెంటు కోసం పొలం వద్దనే రాత్రి, పగలు కాపలా ఉండేటోళ్లం. ఆ 3 గంటల కరెంట్ కూడా ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో తెలియకపోయేది. ఆ మూడు గంటలు అన్ని మోటర్లు ఆన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజులు ఎగిరిపోయేవి. వాటిని రిపేర్ చేసేసరికి ఉన్న పుణ్యకాలం అయిపోయేది. మళ్లీ రేపు అదే తంతు. సమస్యను తీర్చేందుకు కరెంటోళ్లకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా వాళ్లు రాకుండ్రి. వారు దయతలిచి వచ్చినప్పుడు సకల మర్యాదలు చేయాల్సి వచ్చేది. రెండు, మూడు రోజులకోసారి తప్పనిసరిగా మోటర్లు కాలిపోయేవి. లేదంటే వైర్లు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేవి. అందుకే కరెంటోళ్లు చెప్పింది మారు మాట్లాడకుండా వినాల్సి వచ్చేది. కొంత పొలం సాగుచేసినా కరెంటు కోసమే అక్కడే ఉండేటోళ్లం. నాకు ఉన్న నాలుగెకరాల్లో 9 ఏండ్ల కిందట వానకాలంలో ఎకరం మాత్రమే వరి నాటు వేసేవాణ్ణి. ఆ ఏకరం తడపడానికి కూడా అవస్థలు పడాల్సి వచ్చేది. 3 గంటల సమయంలో మధ్యన కరెంటు పోయి వస్తే.. మళ్లీ తడిపిన మడినే తడపాల్సి వచ్చేది. చివరి మడి తడపాలంటే తలపాణం తోకకొచ్చేది. కరెంటు కోతల కారణంగా కోతల చివరి నాటికి ఒకటి, రెండు మళ్లకు నీళ్లు అందక వదిలేసేటోళ్లం. ఇప్పుడు నా పొలంతోపాటు పక్కన ఐదెకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నా. ఒక పంట కాదు. రెండు, మూడు పంటలు పండించికుంటున్నా. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చొరవతో పెద్దవాగులో ఏడాది పొడువునా నీళ్లు ఉంటున్నాయి. వాగులో చెక్‌డ్యాంలు నిర్మించడంతో సాగునీటి సమస్య లేదు. ప్రస్తుతం 12 గంటల కరెంటు వస్తుంది. వ్యక్తిగత పనులు చేసుకుంటూనే వ్యవసాయం చేస్తున్నా. రాత్రి ఇంటి వద్దనే ఉంటున్నా. అప్పుడు ఎండాకాలం వచ్చిందంటే కోతల సమస్య ఎక్కువై కరెంటు కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసేటోళ్లం. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. ఆ కాంగ్రెస్ పార్టీ వద్దు.. ఆ కరెంటు కష్టాలు మాకొద్దు. కేసీఆర్ ఇస్తున్న ఉచిత కరెంటు, పెట్టుబడి సాయంతో వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా ఉంటున్నాం. మళ్లీ మాకు కేసీఆర్ సారే రావాలి.
కాలువ తడిసేలోపే కరెంట్ పోయేది..
కాంగ్రెస్ పాలనలో రైతులు కూలీలుగా మారారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులపై తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు. కాంగ్రెస్ పాలనలో ఉద యం 3గంటలు, సాయంత్రం 3గంటలు కరెంట్ ఇచ్చే వారు. కా లువలు తడిసే లోపే కరెంటు పోయేది. అప్పట్లో లో వోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి నరకయాతన చూశాం. మోటర్లను రిపేరు చేయించుకోలేక, పెట్డుబడులు రాక ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి వేళ కరెంటు కోసం పడిగాపులు కాసే వారు. షార్ట్ సర్క్యూట్, పాముకాటుకు గురై ఎంతోమంది మృతి చెందారు. 75 ఏండ్ల కాలంలో వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ పాలకులు కుదేలు చేశారు. అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉంటేనే దేశం సిరి సంపదలతో బాగుంటుంది. రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.. వారి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పట్లో రైతులు సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు చేసేవారు. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల పంటలు పుష్కలంగా పండుతుండగా.. ఇతర రాష్ర్టాలకు ధాన్యాన్ని ఎగుమతి చేసే పరిస్థితి ఉన్నది. అలాంటి ముఖ్యమంత్రిని మరోసారి చూడాలన్నదే రైతుల ప్రగాఢ విశ్వాసం. – గిన్నె కొండారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు
కేసీఆర్ సార్ దయవల్ల సంతోషంగా ఉన్నాం
సీఎం కేసీఆర్ దయవల్లే రైతులం సంతోషంగా ఉన్నాం. మా కష్టాలు తెలుసుకున్న కేసీఆర్ సార్ అవసరమైన పథకాలు అమలుచేస్తూ.. అండగా ఉంటున్నడు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతులకు ధైర్యం కల్పిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉండదు, ఎరువులు, విత్తనాలు దొరకవు, నీళ్లు లేక చాలా గోస పడ్డాం. కరెంటు ఎప్పుడోస్తుందో తెలియక పొలాల్లో జాగరణ చేసేటోళ్లం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేటివి. కరెంటు రాక పంటలు ఎండిపోయేటివి. ఇప్పుడు కరెంటు సమస్య లేదు. 24గంటల కరెంటు రావడంతో మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్లి పొలానికి నీళ్లు పారించుకుంటున్నం. సీఎం కేసీఆర్ సార్ వల్ల కరెంటు, ఎరువులు, విత్తనాల సమస్య లేదు.
– వర్ధం ఆంజనేయులు, సింగారం, అచ్చంపేట మండలం
రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలను గుర్తించి వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ ఇస్తోంది. అలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 3గంటల కరెంట్ సరిపోతుందని అనడం విడ్డూరంగా ఉంది. గంటలో ఎకరం భూమి తడుస్తుందా? రేవంత్ రైతు అయితే ఎకరం భూమి తడవడానికి ఎంత సమయం పడుతుందో తెలిసేది. మూడుగంటల కరెంట్ ఇస్తే పారినచోటే పారుతది తప్పా నీరు ముందుకు పోయే అవకాశం ఉండదు. 24 గంటల కరెంట్ ఇస్తేనే 5ఎకరాల భూమికి నీళ్లు సరిపోవడం లేదు. ఆయన వ్యవసాయం చేస్తే తెలిసేది రైతుల ఇబ్బందులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ మాట అటుంచితే.. అసలు విద్యుత్ సరఫరా ఉంటుందా అన్న అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలే.
– ఆంజనేయులు, రైతు, బూరెడ్డిపల్లి
బీఆర్ఎస్తోనే రైతాంగానికి మేలు
తెలంగాణ రాకముందు కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రేయింబవళ్లు కరెంట్ ఉంటున్నది. దీంతో రైతులకు పెద్ద బాధ తప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యాంధ్రుల పాలనలో విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. రైతులు రాత్రిపూట కూడా పొలాల వద్దే ఉండి పలు ప్రమాదాలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ బాధ లేదు. 24గంటల కరెంట్‌తో రాత్రివేళ పొలాలకు వెళ్లడం రైతులు మానుకున్నారు. ఇప్పుడేమో రేవంత్‌రెడ్డి రైతులకు మూడుగంటల విద్యుత్తు చాలని చెబుతుండడం ఆశ్యర్యంగా ఉంది. ఆయన పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. మూడుగంటల విద్యుత్తు సరఫరాతో పొలాలకు నీరు ఏమేర పారుతుందో రైతులందరికీ తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే రైతాంగానికి మేలు జరుగుతుంది. ఇందులో సందేహమే లేదు.
– బెల్లం వెంకటేశ్, రైతు, గట్టు
గుతుపలు పట్టి తరుముతరు..
రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యవసాయంపై అవగాహన లేనివి. రైతు కష్టాలు తెలియని వారు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. రైతులకు 24 గంటల కరెంటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కష్టపడుతోంది. క్షేత్రస్థాయిలో వెళ్లి రైతుల కష్టాలను చూస్తే తెలుస్తుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదు. చిల్లర తగాదాలు చేస్తూ, వీధి కుక్కల్లా మొరుగుతూ పోతే తెలంగాణ రైతాంగం గుతుపలు చేతబట్టి తరుముతరు. రైతు జీవితం, వారి కష్టాల గురించి అవగాహన లేకుండా కరెంటు విషయంలో అనుచిత వ్యాఖ్యలు తగవు. గతంలో కరెంటు లేక రాత్రనక, పగలనక బోరుబావుల వద్ద కరెంటు కోసం ఎదురు చూసేటోళ్లు. ఇప్పుడు 24 గంటల కరెంటు సరఫరాతో రైతు పగలే సంతోషంగా నీరు పారబెట్టుకుంటున్నడు. ఇలాంటి సమయంలో రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని అనడం వారి బతుకుల్లో చీకటి నింపే ప్రయత్నం చేయడమే. వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని నాగర్‌కర్నూల్ ప్రాంత రైతాంగం తరఫున హెచ్చరిస్తున్నా.
– చంద్రశేఖర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్
అందుకే ఎవరూ నమ్మరు..
వ్యవసాయానికి మూడుగంటల కరెంటు సరిపోతుందన్న మాటలతో కాంగ్రెస్ పార్టీ అసలు రూపాన్ని బయటపెట్టినట్లయింది. మూడు గంటల కరెంటు ఏ మూలకు సరిపోదనే విషయం రైతులందరికీ తెలుసు. రైతు కష్టాలపై చాలా అవగాహన ఉందని చెప్పే కాంగ్రెస్.. ఇలా మాట్లాడడం సమంజసం కాదు. అందుకే ఆ పార్టీని ఎవరూ నమ్మడం లేదు. రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేకిగా కనబడుతున్నాడు. కేసీఆర్ అమలుచేస్తున్న 24 గంటల ఉచిత కరెంటే ఉత్తమం. ఆ మాటకొస్తే దేశమంతా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వాలన్న బీఆర్ఎస్ డిమాండ్ సరైనదే. రైతు లేకుంటే రాజ్యమే లేదు. రైతులపై చిన్నచూపు తగదు. తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలన్నీ దేశం అంతటా విస్తరించాలి. ఏ రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీ అంటే రైతుల పార్టీ అని గుర్తింపు పొందింది. రైతు వ్యతిరేక పార్టీకి ఈ ఎన్నికల్లో నూకలు చెల్లుతయ్.
– చటమోని రాముడు, రైతు, శేరిపల్లె