వనపర్తి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పెండింగ్‌లో ఉన్న శంకరసముద్రం రిజర్వాయర్ పనులు కొలిక్కి రావడం లేదు. ఈ సమస్యను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్న లక్ష్యంతో గతేడాది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కొత్తకోటలో పర్యటించారు. శంకరసముద్రం రిజర్వాయర్‌ను పూర్తిగా పరిశీలించి కానాయిపల్లి నిర్వాసితులతోనూ మాట్లాడారు.
అనంతరం ఇందుకు కావాల్సిన నిధులను మంజూరు చేసి రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇందుకు కావాల్సిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. దీంతో ఆగమేఘాలపై రెవెన్యూ అధికారులు పని కానిచ్చారు. కానీ వాటిపై నేటి వరకు ఎలాంటి ఉలుకూ.. పలుకూ లేదు.
హామీలకు అందని ఆర్థిక సహకారం
భీమా ఎత్తిపోతల పథకం-2లో అంతర్భాగమైన కానాయపల్లి శంకరసము ద్రం రిజర్వాయర్‌ను కొత్తకోట మండలంలో నిర్మించారు. 2005లో మొదలైన ఈ పథకంలో ఇప్పటికీ ఈ రిజర్వాయర్ పనులు కొలిక్కి రావడం లేదు. కా నాయిపల్లి గ్రామంలోని కొంత భాగం రిజర్వాయర్‌లో ముంపునకు గురైంది. 250 కుటుంబాలకుగానూ పునరావాసం కల్పించాలని ప్రారంభంలో నిర్ణయించారు.
అనంతరం క్రమంగా గ్రామంలో ఉన్న 1100 కుటుంబాలకు పునరావాసం కల్పించాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో ప్రభుత్వం ఇందుకు సుముఖత తెలిపి పనులను చేపట్టింది. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లకు సమీపిస్తున్నా.. కానాయపల్లి పునరావాస పూర్తికి.. ఇచ్చిన హామీలకు ఎలాంటి ఆర్థిక సహకారం అందకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముందుకు సాగని ప్రతిపాదనలు
శంకరసముద్రం రిజర్వాయర్‌లో మునకకు గురవుతున్న కానాయపల్లి పునరావాస పనుల కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచన మేరకు స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి రూ.32 కోట్లు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. గ్రామస్తుల కోరిక మేరకు పనులు పూర్తి చేసి మొత్తం గ్రామాన్ని తరలించాలన్న లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ గతేడాది 25 సెప్టెంబర్ రోజున మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మె ల్యే మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి రిజర్వాయర్‌ను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. ప్రధానంగా పునరావాస సమస్యను తొలగించాలన్న అంశంపైనే మంత్రి పర్యటన కొనసాగింది.
రిజర్వాయర్ కట్టపైనే షామియాన వేసి మ్యాప్ ద్వారా ఇరిగేషన్ ఇంజినీర్లు, మంత్రి ఉత్తమ్‌కు సమస్యను వివరించారు. అనంతరం గ్రామస్తులతో మంత్రి స్వయంగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కలెక్టర్‌తోనూ మాట్లాడిన మంత్రి కానాయపల్లి పునరావాసం కోసం అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపించాలని ఆదేశించారు.
దీంతో ఆగమేఘాల మీద గతేడాది అక్టోబర్ 15న రూ.32 కోట్లతో వివిధ అవసరాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు ఇప్పటి వరకు సచివాలయంలోనే మూలుగుతున్నాయే తప్పా ఎలాంటి మంజూరులు లేవు. మంత్రి పర్యటన జరిగి ఏడాది కావస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పునరావాస సమస్య తయారైంది.
111 ఎకరాల్లో రూ.50 కోట్లతో నిర్మాణాలు
కానాయిపల్లి శంకరసముద్రం రిజర్వాయర్ కట్ట పనులను కొలిక్కి తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునరావాసంపై దృష్టి సారించించారు. నాటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు. 111 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టి, 1,129 మందికి ప్లాట్లను కేటాయించారు.
ఇందుకు వారి పేర్లతో సర్టిఫికెట్లను సిద్ధం చేసినప్పటికీ వారు తీసుకోవడానికి ముందుకు రాలేదు. పునరావాసం కోసం ఎంపిక చేసిన స్థలంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రం తదితర నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన నిర్మాణాలను దాదాపుగా పూర్తి చేశారు. అనంతరం గ్రామస్తులను నూతన స్థలంలోకి మార్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, ఈ విద్యా సంవత్సరం నుంచి కానాయిపల్లి విద్యార్థులు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడంతో పునరావాస స్థలంలోని నూతన భవనంలో బడి నిర్వహిస్తున్నారు.
18 ఏళ్లు నిండిన వారిని గుర్తించాలని..
కానాయిపల్లిలో 18 ఏళ్లు నిండిన యువకులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం చేయూతనివ్వాలన్న డిమాండ్ గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నది. శంకరసముద్రం రిజర్వాయర్ నిర్మాణం దాదాపు 20 ఏళ్ల కిందట మొదలైంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఇక్కడి కుటుంబాల్లో సహజంగానే చాలా మార్పులు వచ్చాయి. ఇలా మారిన పరిస్థితులకు అనుగుణంగా పునరావాస సహకారం కావాలన్నది గ్రామస్తుల ప్రధాన డిమాండ్. దీంతో అన్నీ సిద్ధం చేసినా కొత్త స్థలంలోకి కుటుంబాలు మారడం లేదు.
దాదాపు 300కుపైగా యువకులను కొత్తగా గుర్తించినప్పటికీ వారికి ఎలాంటి ప్రయోజ నం చేకూరలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 40 వేల ఎకరాలకు అందని సాగునీరు శంకరసముద్రం రిజర్వాయర్‌కు కుడి, ఎడమ కాల్వలను ఏర్పాటు చేశారు. కుడి కాల్వ 19వ ప్యాకేజీగా ఉంటే, ఎడమ కాల్వ 27వ ప్యాకేజీగా ఉంది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిర్మాణం చేయకపోవడంతో రెండు కాల్వలకు నీరు అసంపూర్తిగానే వెళ్తున్నది.
కుడి కాల్వ నిర్మాణం కూడా పూర్తి చేయకపోగా, నాలుగు గ్రామాలైన పాలెం, నిర్విన్, కనిమెట్ట, మోజర్ల వరకే సాగునీరు పరిమితమైంది. 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే క్రమంలో కేవలం 4 వేల ఎకరాలకు.. అది కూడా మోటర్ల సాయంతో అతికష్టంగా నీటిని అందిస్తూ వస్తున్నారు. రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపకపోవడంతో ప్రతిఏటా మోటర్లు పెట్టి కాల్వకు నీటిని తరలించాల్సి దుస్థితి. ఇదిలా ఉంటే, 64 కిలోమీటర్ల 27వ ప్యాకేజీ కాల్వలోనూ నీళ్లు 30 కిలోమీటర్లు దాటడం లేదు. 49 వేల ఎకరాల ఆయకట్టు ఈ కాల్వ పరిధిలో ఉంటే చివరి గ్రామాలకు సాగునీటి ఊసేలేదు.
వెరసి సుమారు 35వేల ఎకరాల ఆయకట్టుకు శంకరసముద్రం రిజర్వాయర్ నుంచి భీమా సాగునీరు అందించలేకపోతున్నారన్న అంచనా ఉన్నది. పునరావాస సమస్యతో కేవలం 600 మీటర్ల రిజర్వాయర్ బండ్ ను నిర్మించకపోవడంతో సగం ఆయకట్టుకు కూడా నీరందడం లేదు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.81 టీఎంసీలు ఉంటే కరకట్ట నిర్మాణం జరగనందునా కేవలం 0.798 టీఎంసీల వరకే నీటిని నిల్వ చేస్తున్నారు. దీంతో కుడి కాల్వకు మోటర్లు లేకుండా అసలు నీరందడమే లేదు. ఎడమ కాల్వకు చివరకు నీరు పారని పరిస్థితి.
నిధులు మంజూరు కాలేదు
కొత్తకోట మండలం కానాయపల్లి పునరావాస పనులకు నిధులు మంజూరు కాలేదు. గతేడాది రూ.32 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలన్న లక్ష్యంతోనే నిధుల కోసం ఎస్టిమేషన్ పంపించాం. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరైన వెంటనే పూర్తిస్థాయిలో పునరావాస పనులను చేయిస్తాం.
– సుబ్రమణ్యం, ఆర్డీవో, వనపర్తి