మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జడ్చర్ల టౌన్ అక్టోబర్ 9 : లారీ ఢీకొని ఓ ప్రైవేట్ స్కూల్ బస్ బోల్తా పడగా 25మంది విద్యార్థులకు గాయాలైన ఘటన జడ్చర్ల శివారులోని మయూరి పార్క్ వద్ద చోటు చేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు కథనం మేరకు మౌంట్ బాసిల్ స్కూల్‌కు చెందిన బస్సు సోమవారం ఉదయం విద్యార్థులతో జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ పైపు వెళ్తున్నది. కొత్త తండా వద్ద పాఠశాల సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా లారీ వెనుక నుంచి వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు బోల్తా పడగా అందులో ఇరుక్కుపోయిన చిన్నారులను వాహనదారులు బయటికి తీయగా మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో నలుగురు విద్యార్థులకు కాళ్లు, చేతులు విరగగా ఇద్దరి తలలకు తీవ్ర గాయాలైనట్లు దవాఖాన ఆర్ఎంవో వేణు తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దవాఖానకు వెళ్లి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మీడియాతో మాట్లాడారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. 2014కు ముందు జడ్చర్ల-మహబూబ్‌నగర్ మధ్య సింగిల్ రోడ్డుపై అనేక ప్రమాదాలు జరిగి చాలామంది మృతి చెందారని తెలిపారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరుగకుండా వేగ నియంత్రణ పాటించడంతోపాటు సైన్ బోర్డులు, లైనింగ్స్ పెంచేలా చూస్తామన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని దవాకాన డైరెక్టర్ కృష్ణారెడ్డికి సూచించారు. జిల్లా విద్యాధికారి రవీందర్, జడ్చర్ల సీఐ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.