ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు పండుగను తలపిస్తున్నాయి. గులాబీ శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా తరలిరావడంతో సభాప్రాంగణాలు జనజాతరను మైమరిపిస్తున్నాయి. నాయకులు చిందులు వేస్తూ సందడి చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అమరచింతలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి సమ్మేళనాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారన్నారు. దీంతో పుట్టగతులు ఉండవనే భయంతో పీఎం మోదీ ఈడీ అధికారులతో దాడులు చేయిస్తూ.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఈడీ దాడులకు బెదరడన్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే టూరిస్ట్ నాయకులు కావాలా..
నిత్యం ప్రజల మధ్యే ఉండే మనిషి కావాలా..? ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు.
– నెట్వర్క్, మార్చి 27 (నమస్తే తెలంగాణ)
మహబూబ్‌నగర్, అర్బన్ మార్చి 27: నియోజకవర్గంలోని ప్రజలంతా తన అన్నదమ్ములతో సమానమని.. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. న్యూటౌన్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం 14,15,16,28, 29,30,31, 32,33,34,35,36,45,46,47,4 8,49 వార్డుల పరిధిలోని ముఖ్యకార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు కార్యకర్తలు, నాయకులు నిరంతరం సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృషిలో ఉంచుకొని పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఉండాలన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి తప్పక గుర్త్తింపు ఉంటుందన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపుకొని సమన్వయంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈప్రాంతం రూపురేఖలనే మార్చే అమరాన్ లిథియం గిగాసెల్ పరిశ్రమను మంత్రి కేటీఆర్ సహకారంతో ఇక్కడకు తీసుకొస్తే.. కొందరు ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మంచి కోసం చేసే పనికి ఎవరు అడ్డు వచ్చినా ఆగే ప్రసక్తి లేదన్నారు. ఏప్రిల్ నాకి దివిటిపల్లి ఐటీ టవర్‌లో 5 ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, భవిషత్తులో మరిన్ని భారీ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి.. ఎమ్మెల్యే కశిరెడ్డి
ఒకప్పటి, ప్రస్తుత మహబూబ్‌నగర్‌ను అభివృద్ధిలో పోల్చి చూసుకోవాలని బీ ఆర్ఎస్ పార్టీ పరిశీలకుడు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. భవిష్యత్తులో మరింత ప్రగతి కోసం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చాలాకాలం తరువాత మహబూబ్‌నగర్ వచ్చిన వాళ్లు ఇక్కడి అభివృద్ధిని చూసి అశ్చర్యపోయారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఊహించని విధంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో పాలమూరు కూడా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలు మంత్రికి పుష్కలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్‌కమిటీ చైర్మన్ రహమాన్, డీసీసీబీ వైస్‌చైర్మన్ వెంకటయ్య, గొర్రెలకాపరులసంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ గణేశ్, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ రాములు, శివరాజ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.