మహబూబ్నగర్ : పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 18వ వార్డ్ ప్రేమ్ నగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించి కాలనీలో సందర్శించారు. ఇల్లిల్లు తిరుగుతూ నేరుగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ బిల్డింగ్, ట్రాన్స్ఫార్మర్ తదితర సమస్యలను ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు.
ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకొని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యను గుర్తించి పూర్తిస్థాయిలో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు లేని పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు.
18 లోపు పూర్తిస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని, తీవ్రతను బట్టి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ నర్సింలు, ముడ చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్లు మల్లేశ్వరి, కిషోర్,రాము, తదితరులు ఉన్నారు.