మహబూబ్‌నగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుండగా.. సంక్షే మం అర్హుల దరికి చేరుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. దీంతో నేడు దేశమంతా తెలంగాణ వైపే చూస్తున్నదన్నారు. జిల్లాకేంద్రం లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ముందుగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ బలోపేతం కావడమే లక్ష్యంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు చేయడానికి చాలామంది వస్తుంటారు.. అలాం టి వారిపై అప్రతమ్తంగా ఉండాలని సూచించారు. అధికారం కోసమే రాజకీయాలు చేస్తుంటారని ధ్వజమెత్తారు. వారికి పేదల సంక్షేమం పట్టదు.. బాగోగులు పట్టవు.. కేవలం అధికారం కోసమే పాకులాడుతారని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తూ రాష్ర్టాన్ని సుభిక్షంగా మార్చారని తెలిపారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మన పథకాలను దేశవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించి అంచలంచెలుగా ఎదుగుతున్నారని చెప్పారు. ఇవాళ దేశం మొత్తం మన రాష్ట్రంవైపు చూస్తున్నదన్నారు. మన ది ఆషామాషీ పార్టీ కాదు.. తెలంగాణ సాధనకు ఉద్యమించి.. స్వరాష్ట్రం సిద్ధించాక రాజకీయ పార్టీగా అవతరించి.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకున్నదని చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్నందుకు ప్రతి కార్యకర్త, నేతలు గర్వపడాలన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు వెళ్తే కేసీఆర్‌ను చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారని తెలిపారు. వాళ్ల బాష మనకు రాదు.. మనభాష వాళ్లకు అర్థం కాదు.. అయినా వాళ్ల రాష్ట్రం కూడా తెలంగాణ లాగా బాగుపడాలని వారందరూ సభకు హాజరయ్యారని చెప్పారు.
కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ రాష్ట్రంలో రైతుబంధు, ఆసరా పింఛన్, ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి వచ్చేదా అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర కీలకమన్నారు. ప్రభు త్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. తాను వారణాసికి వెళ్తే అక్కడున్న వాళ్లు అడిగారని.. ఇంకా చాలా ఉంది బిడ్డ.. 20శాతమే చూసిన్రు.. ఇంకా 80శాతం మిగిలే ఉందని చెప్పానన్నారు. అందరికీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ప్రతి ఎకరాకూ సాగునీరు, తాగునీటి వసతి, విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పక్క రాష్ర్టాల వాళ్లు కూడా మన పాలమూరుకు వచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు.