మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 10 : హైకోర్టులో న్యాయమే గెలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటీషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సందడి నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని పటాకులు కాల్చి.. మిఠాయిలు తినిపించుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నటికైనా న్యాయమే గెలుస్తుందనేది ఈ తీర్పు ద్వారా వెల్లడైందన్నారు.
జిల్లాను పరిపాలించిన ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వారి అస్తిత్వం కనుమరుగువుతుందని కుట్ర పన్నారన్నారు. బీసీల ద్వారా.. బీసీ మంత్రినైన తనపై కేసు వేయించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల హృదయాలను గెలిచి విజయం సాధించాలే కానీ.. అక్రమ కేసుల ద్వారా తప్పుడు మార్గంలో గెలుపునకు ప్రయత్నించడం దుర్మార్గమైనదని విమర్శించారు. కనీసం సాగు, తాగు నీళ్లు ఇవ్వలేని వారిని ప్రజలు ఛీదరించుకున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మహబూబ్‌నగర్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక కేసు వేయించారన్నారు.
బలహీన వర్గాలకు చెందిన తనలాంటి నేతలు ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకుంటే.. కొందరు ఐదేండ్లుగా కేసుల పేరిట సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జోగుళాంబ అమ్మవారు, మన్యంకొండ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉన్నంతవరకు తప్పుడు ఆరోపణలు, కేసులు ఎక్కువ రోజులు నిలబడవన్నారు. తనపై కుట్ర చేసిన వారి పేర్లను ఆధారాలతో సహా వెల్లడిస్తానని, వారు ప్రజలకు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మహబూబ్‌నగర్ జిల్లాను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.
జిల్లా కేంద్రంలో సంబురాలు..
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 10 : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు కొట్టివేయడంతో మున్సిపాలిటీలోని 16వ వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తున్న మంత్రికి మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు చంద్రశేఖర్, వెంకట్రాములు, న ర్సింహులు, షకీల్, వెంకటేశ్, నాగరాజు, శ్రీను, అంజి, యాదయ్య, మురళి, పవన్ తదితరులు పాల్గొన్నారు.