మహబూబ్‌నగర్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జడ్చర్ల కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. మరి నాడు పాలమూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఉంటే నేడు ప్రజలు మిమ్మల్ని గుర్తించేటోళ్లు అన్నారు. పాలమూరును వలసలకు చిరునామాగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే అని ధ్వజమెత్తారు. పాలమూరులో 14 రోజులకోసారి తాగునీరు వచ్చే పరిస్థితి మీ వల్లే దాపురించిందన్నారు. కానీ తెలంగాణ ఏర్పడడం.. కేసీఆర్ సీఎం అయ్యాక పట్టణంలో నేడు మిషన్ భగీరథ శుద్ధజలాలు నిత్యం సరఫరా అవుతున్నాయని తెలిపారు.
వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరెంట్ ఇస్తున్నాం.. రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. మరి కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు పథకం ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో 2014కు ముందు కేవలం 30 హాస్టల్స్ మాత్రమే ఉండేవని, కానీ నేడు ఏకంగా 140 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. ఇది కాదా మా ఘనత.. ప్రతి స్కూల్‌ను ఇంటర్.. డిగ్రీ కళాశాలుగా అప్‌గ్రేడ్ చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు.. చెప్పినట్లే చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. మీ పాలనలో నెలకు రూ.10 కోట్ల పింఛన్లు మాత్రమే ఇస్తే… నేడు రూ.106 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు మా ప్రభుత్వం రూ.లక్ష అందిస్తున్నదని తెలిపారు. మీరు భూమి పూజ చేసి వదిలేసిన ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేవలం 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే… పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కేవలం 9 ఏండ్లలో 8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత మాదన్నారు.
ఎంజీకేఎల్ఐ పథకంలో కేవలం 2 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ను కూడా కాంగ్రెస్ పాలనలో పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా సుమారు 70 టీఎంసీలను నిల్వ చేసే ఐదు అతి పెద్ద రిజర్వాయర్లను నిర్మాణం చేస్తున్నామన్నారు. సాగు, తాగు నీటిని అందించి వలసలు వాపస్ వచ్చేలా చేశామన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు స్థానికంగా ఉపాధి అందించేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మించిన ఘనత మాదే అన్నారు. మీ హయాంలో సేదతీరేందుకు పాలమూరులో చిన్న పార్కు కూడా లేదని.. నేడు ఎన్నో సుందరమైన పార్కులను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో బడుగు, బలహీనర్గాలకు చెందిన వారిని రాజకీయంగా.. సామాజికంగా ఎదగకుండా చేశారని ధ్వజమెత్తారు. నాటి నేతల తీరుతో మావోయిస్టులు పుట్టుకొచ్చారని, ఇందుకు కారణం మీరే.. వారిని ఎన్కౌంటర్లో చంపింది మీరే.. అన్నారు. రేవంత్.. మీకు చిన్న కులాలపై ఎందుకు అంత కసి.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కులాన్ని అవమానిస్తూ పిచ్చగుంట్లవాళ్లు అంటూ హేళన చేస్తారా.. ఆ కులంలో పుట్టడం బలహీన వర్గాల వారు చేసుకున్న పాపమా..? అని ప్రశ్నించారు. ఓట్ల సమయంలో ఈ బడుగుల అవసరం.. తర్వాత అవమాన పర్చడమేనా మీ వైఖరి.. అని నిలదీశారు. సురవరం ప్రతాపరెడ్డి పుట్టిన నేల ఇది.. ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం హుందాగా జీవించాలని హితవు పలికారు. సీఎం వయస్సు ఎంత.. నీ వయస్సెంత.. వారిని ఇష్టానుసారంగా మాట్లాడుతావా..? ఇదేనా నీ సంస్కారం.. నాడు సోనియాను దెయ్యం అన్నావు.. ఇయ్యాల దేవత అంటున్నావు.. రేపు ఏమంటావో తెల్వదు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎలాంటి మత కలహాలు లేకుండా ఆత్మగౌరవంతో బతికేలా కృషి చేస్తున్నామని వివరించారు. ఆ వాతావరణాన్ని పాడు చేయొద్దన్నారు. ఉమ్మడి జిల్లా ఇప్పటికే ఎంతో అభివృద్ధి జరిగింది.. ఇంకా ఊహించని విధంగాలా మారుస్తామని పేర్కొన్నారు. ప్రగతి మీ కండ్లకు కనిపించకుంటే.. అది మీ ఖర్మ అన్నారు.