మూసాపేట, నవంబర్ 6 : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరోసారి గెలిచేది బీఆర్ఎస్ కారు గుర్తే.. అని మళ్లీ సీఎం కేసీఆర్ సారే.. అని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో పది మంది సీఎం అభ్యర్థులున్నారని, ఇప్పుడే కుర్చి కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 50 సీట్లలో వాళ్లకు అభ్యర్థులు లేక బయటి నుంచి వచ్చిన వాళ్లకు ఇచ్చారని, బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందన్నారు. కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, గద్వాలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఎవరికి ఇచ్చిందో చూడాలన్నారు. తాము టిక్కెట్ ఇవ్వని వారికి కాంగ్రెసోళ్లు టిక్కెట్లిచ్చారని అన్నారు. టిక్కెట్లు ఇవ్వడానికి అభ్యర్థులు లేని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభలో మంత్రి ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ వదిలేసిన వాళ్లను ప ట్టుకొని టిక్కెట్లు ఇచ్చి మేం గెలుస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నిజంగా ఆ పార్టీ అధ్యక్షుడికి దమ్ముంటే గాంధీభవన్‌లో కూర్చొని పార్టీ టిక్కెట్లను కేటాయించాలన్నా రు. కనీసం 20, 30 సీట్లు గెలిచే పరిస్థితి లేద ని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ధైర్యంగా టిక్కెట్లు ఇచ్చి పంపిన పార్టీ తమదన్నారు. తెలంగాణను అణచివేసిన వాళ్లు… ఇప్పుడు తెలంగాణ పచ్చబడుతుంటే ఓర్వలేక పోతున్నారని అందుకే అబద్ధపు హామీలతో కొత్త వేషం వేసుకొని వచ్చారని విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే తెలంగాణ సర్వనాశనం అవుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కర్ణాటకలో కనీసం 5 గంటల కరెంటు కూడా ఇవ్వడంలేదని.. సాక్షాత్తు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే ఒప్పుకున్నారని.. అలాంటి పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రం చీకట్లోకి వెళ్తుందన్నారు. రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని అంటున్నాడని.. ఎవుసం నాశనం చేయడమే వారి ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు ఉండదు, నీళ్లుండవు, రూ. 2,016 ఇస్తున్న పింఛన్లను మళ్లీ రూ. 200 చేసేస్తారని అన్నారు. రకరకాల వేశాలు, కండువాలు కప్పుకుని మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరారని.. వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ప్లీజ్ ఒక్కసారి అవకాశం ఇవ్వండని అడుక్కుంటున్నారని.. 11 సార్లు అవకాశం ఇస్తే రాష్ర్టాన్ని నాశనం చేశారని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14లక్షల మంది వలసలు వెళ్లేలా చేశారని విమర్శించారు. పొరపాటున వారికి అవకాశం ఇస్తే కుక్కలు చింపిన విస్తరాకును చేసేస్తారని తెలిపారు. వారి దరిద్రమైన పాలన చూశామని వారిని దూరం పెడితేనే ఈ రాష్ర్టానికి మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. త్వరలో పేద ఓసీలకు కూడా గురుకులాలలు ఏర్పాటు చేసుకోబోతున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.