వనపర్తి, జూన్ 23 : ఆచార్య జయశంకర్ జీవితం అందరికీ ఆదర్శమని.. తెలంగాణ త్యాగశీలి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి వీధిలో బులియన్ మర్చంట్ వర్తకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. జయశంకర్‌తో కలిసి ఉద్యమంలో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. ఆచార్య జయశంకర్ పేరుపై ఎకరా పైచిలుకు స్థలంలో నాగవరం సమీపంలో పార్కును ఏర్పాటు చేశామని, అందులో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. త్వరలోనే పార్కు, బైపాస్ రహదారి తదితర అభివృద్ధి పనులను అందరం కలిసి ప్రారంభించుకుందామన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రం వేగంగా విస్తరిస్తున్నదని, చెరువులన్నింటినీ పునరుద్ధరించుకున్నామని తెలిపారు. ఉమ్మడి పాలనలో పట్టణంలో రోడ్లు చిన్నవిగా ఉండడంతో ప్రజలు, వ్యాపారులకు అనేక ఇబ్బందులు కలిగేవని మంత్రి పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాల్లో కనీసం నడవడానికి కూడా వీలులేకుండా అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. ప్రస్తుతం పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, అందులో భాగంగా రోడ్ల విస్తరణ చేపట్టడం ద్వారా ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని వివరించారు. పట్టణంలో తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం రూ.400కోట్లతో పనులు త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని, ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమ్మ, బులియన్ మర్చంట్ సభ్యులు నారాయణదాస్ కిట్టు తదితరులు పాల్గొన్నారు.