నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 16: ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పే తెలంగాణ అభివృద్ధి చెందిందనడానికి ఆనవాళ్లని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలకపల్లి మండల బీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని చిన్నముద్దునూర్ సమీపంలోని కాటన్‌మిల్లులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 14 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 9 ఏండ్లల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు. 40 ఏండ్ల పాలనలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు తెలంగాణ వచ్చాక సస్యశ్యామలం అయ్యాయన్నారు. నాటి పాలకులు అంబలి, గంజి కేంద్రాలు నడిపిన చోటే ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నాడు రూ.2కు కిలో బియ్యం కోసం ఎదురు చూసిన తెలంగాణ నేడు బువ్వ పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. 60వేలమంది గులాబీ కార్యకర్తల బలగం మన కందనూలుకే దక్కిందన్నారు. నాటి బీడుభూములకు నేడు పుష్కలంగా సాగునీరు అందుతున్నదన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యేకే కందనూలు జిల్లాగా రూపాంతరం చెంది మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామన్నారు.
భవిష్యత్తులో సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కూడా ఖాయమన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 40 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. నాటి పాలకులు 1984 నుంచి 2014 వరకు తెలంగాణలో కేఎల్ఐ ప్రాజెక్టు పనులను దశాబ్దాలపాటు సాగదీశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులను పరిశీలించి సాగునీటిని పారించామన్నారు. ప్రాజెక్టు పూర్తయిన వెంటనే అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ ఇంటి దొంగలు 190 రకాల కేసులు వేశారన్నారు. కాళేశ్వరం మొదలుపెట్టిన మూడేండ్లకే సాగునీటిని అందించామని గుర్తుచేశారు. అయినా భాషా, సంస్కారం లేని వాళ్లు, పార్టీలో పదవులు అనుభవించిన వారు సైతం ప్రతిరోజూ కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. పేదల డబ్బు దోచి కార్పొరేట్ శక్తులకు పెడుతున్న వారు కేంద్రాన్ని ఏలుతున్నారన్నారు.
అన్ని వసతులున్న జిల్లాగా..
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు సమకూరిన జిల్లాగా కందనూలును ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాడి పంటలతో సస్యశ్యామలం చేశారని ఎంపీ రాములు అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. గ్రామాల్లో కార్యకర్తలు తిరుగుతూ అభివృద్ధి పథకాలను వివరించాలన్నారు.
కేసీఆర్ కళలకు అనుగుణంగా..
గత ప్రభుత్వాల హయాం గురించి, ఇప్పుడు ఎలా జీవిస్తున్నామనే దానిపై ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాటరూపంలో వివరించారు. సీఎం కేసీఆర్ కలలకు రూపంగా కందనూలు ఎమ్మెల్యే మర్రి మార్చారని కొనియాడారు. నాడు బతకడానికి ఇబ్బందులు పడ్డామని, నేడు బతుకునిచ్చే పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉన్న ఎల్ఐసీని అమ్ముకొని దోచిపెడుతున్నారన్నారు. తెలంగాణలో అభివృద్ధి సాధించిన కేసీఆర్ దేశ మార్పుకోసం బీఆర్ఎస్ను స్థాపించారన్నారు.
ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు
రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని, అందుకే బీఆర్ఎస్ కుటుంబసభ్యులు సంతోషంగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రతి పేద కుటుంబం సంతోషంగా జీవించేందుకు కృషి చేస్తున్న కేసీఆర్ సీఎంగా ఉండడం మన అదృష్టమన్నారు. తెలంగాణ రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందంటే అది కేవలం ప్రజలు పెట్టిన భిక్షేనన్నారు. గతంలో వానకాలంలో వర్షం కోసం ఎదురు చూసేవాళ్లమని, ఇప్పుడు నిత్యం సాగునీరు అందుతుండడంతో రెండుకార్లు పుష్కలంగా రైతులు పంటలను పండిస్తున్నారన్నారు. పార్టీకోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకూ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దన్నారు. తాను సంపాదన కోసం కాకుండా పేదలకు సాయం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాజకీయాల్లోకి రాకుంటే ఇంత పెద్ద కుటుంబాన్ని కోల్పోయేవాడినన్నారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి జమున మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 16: కులవృత్తులు సమాజానికి తల్లిసేవతో సమానమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రజక యువజన క్రాంతి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించి ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. భూస్వాములపై మొట్టమొదటగా ఎదురుతిరిగి పోరాటం చేసిన ధీశాలి చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. ధోబీఘాట్లకు బదులుగా జిల్లాకేంద్రంలో రూ.70 లక్షలతో సీఎం కేసీఆర్ పెద్ద వాషింగ్ మిషిన్లను అందజేసినట్లు గుర్తు చేశారు. రజకులకు ఉచిత కరెంట్ అందించామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నవకాంత్, రజక యువజన క్రాంతి సంఘం అధ్యక్షుడు నాగన్న, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి భారతి, రమేశ్, నాగరాజు, విజయ్‌కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు.
ఏకలవ్య విగ్రహం ఏర్పాటు
జిల్లాకేంద్రంలోని బాదం సరోజాదేవి ఆడిటోరియంలో ఎరుకలసంఘం ఆత్మీ య సమ్మేళనంలో మంత్రి పాల్గొని మా ట్లాడారు. ఈ సందర్భంగా ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అన్ని కు లాలకు సమప్రాధాన్యం లభిస్తున్నదన్నా రు. రిజర్వేషన్ల పెంపుతో ఆదివాసులు, గిరిజన, కోయ, గోండ్రు, లంబాడీ కులాలకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. శ్రీనివాసకాలనీలో ఏకలవ్య విగ్రహం ఏర్పాటుచేస్తామన్నారు. ఏనుగొండలో ఏకల వ్య విద్యార్థి భవనం, ఎరుకల కమ్యూని టీ భవనానికి రెండెకరాల స్థలాకి రూ. 10లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్‌చెర్మన్ గ ణేశ్, కౌన్సిలర్లు కిశోర్, ఎరుకలసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, గౌరవ అధ్యక్షుడు బాలయ్య, వెంకట్రాములు, రాములు, శ్రీరాములు, రాంచంద్రయ్య, తిరుమల రాజు పాల్గొన్నారు.
ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు విలువైన స్థలాలతోపాటు నిధులను ప్రభుత్వం అందజేసిందని మంత్రి వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ గాయత్రి ఫంక్షన్హాల్లో జరిగిన దేవాంగ కులసంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. దేవాంగా ఆత్మగౌరవ భవనం కోసం రాజధానిలో రూ.40కోట్ల విలువైన స్థలంలో రూ.75లక్షల నిధులను కేటాయించిందన్నారు. జిల్లాకేంద్రంలో సైతం భవన నిర్మాణానికి స్థలం, నిధులను కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో దేవాంగ కులసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రారావు, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రావు, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, రవికుమార్, లింగం, కౌన్సిలర్ కిశోర్ పాల్గొన్నారు.