అచ్చంపేట రూరల్, నవంబర్ 3 : నల్లమలలో వెలిసిన పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఉమా మహేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ మహేశ్వరం పంచలింగాల ఆవరణలో రూ1.20కోట్లతో చేపడుతున్న కల్యాణ మండపం, నూత న ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ఉమా మహేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.50లక్షలు పర్యాటక శాఖ ద్వారా కేటాయించగా, పనులను ప్రారంభించినట్లు తెలిపారు.
రూ.50లక్షలను కల్యాణ మండపానికి కేటాయించామన్నారు. వీటితోపాటు అదనంగా మరో రూ.70 లక్షలతో భక్తుల అవసరాలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి 15 రోజుల్లో జీవో జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆరు గ్యారెంటీలను విడుతల వారీగా అమలు చేస్తామని, ఇంకా నాలుగేండ్ల సమయం ఉందన్నారు. రూ.20వేల కోట్లతో ఈనెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి చర్యలు తీసుకుంటామన్నారు.
రుణమాఫీ కాని వారికి త్వరలోనే మాఫీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మా ట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో నల్లమలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ భూత్పూర్-మద్దిమడుగు వరకు నేషనల్ హైవేకు కేంద్రానికి ఎంపీ మల్లు రవి ద్వారా ప్రతిపాదనలు పంపినట్లు గుర్తుచేశారు. అదేవిధంగా మద్దిమడుగు నుంచి మాచర్లకు ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతరాష్ర్టాల మధ్య ఇంటర్ కనెక్టివిటీ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామని ఆంధ్ర సీఎం చంద్రబాబును గతంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు వినతిపత్రం అందజేశామని తెలిపారు.
అనంతరం అచ్చంపేటలో రూ.60లక్షలతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, సీసీఐ ఆధ్వర్యంలో మండలంలోని నడింపల్లి శివారులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత, ఈవో శ్రీనివాసరావు, కార్యదర్శి నర్సింహులు పాల్గొన్నారు.