మహబూబ్‌నగర్, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మినీ ట్యాంక్ బండ్.. ఆ పక్కనే ఆహ్లాదం.. మంచి వాతావరణం.. ప్రజలు సాయంత్రం వేళలో కుటుంబంతో కలిసి ఆటపాటలకు.. నిలయమైన శిల్పారామం పాలమూరు జిల్లా కేంద్రానికి తలమానికంగా మారింది. హైదరాబాద్‌లోని శిల్పారామానికి దీటుగా జిల్లా సంస్కృతి సంప్రదాయాలను కట్టిపడేసే విధంగా నిర్మించిన అద్భుతమైన కట్టడం ఇప్పుడు ప్రైవేట్ పరం అయింది. ఈ శిల్పారామంపై కన్నేసిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చక్రం తిప్పి ఏకంగా పదేండ్లపాటు లీజుకు తీసుకున్న విషయం సంచలనం కలిగిస్తున్నది. ఉమ్మడి జిల్లాకు చెందిన పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో శిల్పారామాన్ని పర్యాటక శాఖ నుంచి మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు బదలాయిస్తూ ఏకంగా ఎంవోయూ కుదుర్చుకున్నారు.
ఆ తర్వాత ప థకం ప్రకారంలో లోపల ఓపెన్ యాక్షన్ పేరుతో కాంగ్రెస్‌కు చెందిన మైనార్టీ నేతకు కట్టబెట్టారు. అప్పట్లో మాజీ మంత్రి పర్యాటక శాఖ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌గౌడ్ ఈ శిల్పారామాన్ని చాలెంజ్‌గా తీసుకొని నిర్మించారు. విశాలమైన ఆవరణలు ఓపెన్ ఎయిర్ థియేట ర్.. చుట్టూ పచ్చిక బయళ్లు.. హైదరాబాద్ శిల్పారామాన్ని తలదన్నే విధంగా గత కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో నిర్మించారు.. పక్కనే మినీ ట్యాంక్‌బండ్ సస్పెన్షన్ బ్రిడ్జి.. ట్యాంక్‌బండ్‌పై విశాలమైన రహదారి.. అటు ఇటు తిరగడానికి పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేసిన ఆట వస్తువులు.. సీనియర్ సిటిజన్లు కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి బెంచీలు వీటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.
మధ్యలో ఆగిన పనులను పూర్తి చేయలేక.. నిధులు లేవనే సాకుతో ఏకంగా శిల్పారామాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేతకు లీజుకి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మే యర్ చాంబర్లకు రూ.లక్షలు తగలేసి ఆధునీకరణ చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు.. మినీ శిల్పారామాన్ని మె యింటైన్ చేయలేక ప్రైవేట్‌కు ధారదత్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహణ చేయలేక పర్యాటక శాఖ చేతులెత్తేసిందనీ నమ్మించి సాగిన ఈ దందాపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లా కేంద్రంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చాలెంజింగ్‌గా తీసుకొని ఆక్రమణలకు గురైన పెద్ద చెరువును కాపాడి సుందరీకరించి ఆనకట్టకు దిగువన అద్భుతమైన రీతిలో శిల్పారామాన్ని నిర్మించా రు. కళలకు, సంస్కృతి, సంప్రదాయాలకు.. నిలయం గా దీన్ని తీర్చిదిద్దారు. మహిళా సంఘాల ప్రతినిధులు తాము తయారు చేసిన వస్తువులను ఇక్కడ అమ్ముకునేందుకు.. వివిధ రకాల ఎక్స్‌పోలు చేయడానికి.. విద్యార్థులకు సామాజిక విషయాలపై అవగాహన కల్పించేందుకు ఏకంగా ఓపెన్ థియేటర్ నిర్మించారు. సాయం త్రం వేళల్లో వస్తే కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కూ డా ఆధునిక పద్ధతుల్లో మినీ గుడిసెలు సైతం నిర్మించా రు. పాలమూరును పర్యాటక ప్రదేశంగా మార్చి వేయాలనే తపనతో రూ.కోట్లు ఖర్చుపెట్టి నిర్మించారు.
భవిష్యత్‌లో వీటి చుట్టూ అమేజింగ్ పార్క్.. రాష్ట్రంలోనే ఎ క్కడా లేని విధంగా అనేక ఆధునిక సౌకర్యాలు క ల్పించే విధంగా దీన్ని ప్రత్యేకంగా రూపు దిద్దించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నా కేవలం తక్కువ ఖ ర్చుతో ఈ శిల్పారామంలో కార్యక్రమాలు నిర్వహించుకునే విధం గా దీన్ని మలిచారు. ఇంత అద్భుతమైన శిల్పారా మంను అందుబాటులోకి తీసుకొస్తే బీఆర్ఎస్ కు ఎక్కడపేరు వస్తుందోనని కుట్రలకు తెరలేపుతున్నారు.

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార పార్టీలో చిచ్చురేపాయి. దీని నుంచి ఉపశమనం పొందడానికి అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత కాంగ్రెస్ చోట నేతలకు పాలమూరును కబ్జా చేసుకోండి అంటూ వదిలేశారు. ఇలా ఎన్నికలు అయ్యాయో లేదో.. కార్పొరేషన్ లో పదవి అనుభవిస్తున్న ఓ ముఖ్య నాయకుడి అనుచరుడు ఏకంగా జిల్లా కేంద్రంలోని వైన్స్‌ల వద్ద అమ్ముతున్న పల్లి బఠానీల కేంద్రాలపై పడ్డారు. ముఖ్యనేత పేరు అడ్డం పెట్టుకొని అప్పటికే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ తరిమి కొట్టి తన అనుంగులకు ఈ షాపులను కట్టబెట్టారు. ఫలితంగా ప్రతి వైన్ షాప్ దగ్గర వ్యాపారం చేసుకుంటున్న వారి నుంచి ప్రతి నెలా మామూళ్లు వసూలు చేసుకుంటూ పబ్బం గడుపుకొంటున్నారు. మరోవైపు కార్పొరేషన్లో చికెన్ వ్యర్థాల టెండర్లను కూడా మరో నేత వాటాలు దక్కించుకొని సంపాదిస్తున్నా డు. తైబజార్ వేలం పాట లు కూడా కాంగ్రెస్ నేతలే జొరబడి వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఇదంతా ఓకే అయితే మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్‌గా ఇస్తారని భావించిన ఓ నేత చివరి నిమిషంలో చేజారడంతో నిరాశకు గురయ్యారు. పాలమూరు పట్టణంలో నీకేం కావాలో కోరుకో అని ముఖ్యనేత అనగానే వెంటనే శిల్పారామంపై కన్ను పడింది. ఇక సచివాలయం నుంచి మంత్రి జూపల్లి పేషీలో పైరవీలు చేసి శిల్పారామాన్ని కార్పొరేషన్‌కు బదులాయిస్తున్నట్లు పర్యాటక శాఖ నుంచి ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఇక అక్కడ నుంచి ఇక్కడికి రాగానే అసలు కథ మొదలైంది. అనుకున్న రీతిలో సదరు చోటా నేతకు ఏకంగా శిల్పారామాన్ని కట్టబెట్టి పాలమూరు పర్యాటక ప్రవేశాన్ని తాకట్టు పెట్టేశారు.
పాలమూరులోని మినీ శిల్పారామాన్ని దక్కించుకున్న సదరు నేత భారీ ఎత్తున ఆదాయ మార్గాలను అన్వేషించుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. శిల్పారామం గేట్ కాలు పెడితే ఇక టోల్ వసూలు చేస్తారు. లోపలికి వెళ్లి బయటికి రాగానే జేబులు చిల్లు అవుతాయి. శిల్పారామం ఉద్దేశాన్ని మార్చివేసి కమర్షియల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక శిల్పారామం లో ఉన్న ఫంక్షన్ హాల్ లో కూడా దక్కించుకున్న కాంగ్రెస్ నేత భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా ఇందులోనే నిర్వహించాలని దానికి తగ్గట్టు భారీ ఎత్తున ఫీజు వసూలు చేసుకోవాలని ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కార్పొరేషన్ ఆవరణలో ఉన్న పూర్తయిన కళాభారతిని ప్రారంభించలేదు..
ఇక బాదం రామస్వామి ఆడిటోరియాన్ని కూడా గాలికి వదిలేశారు. ఇక ఈ చోట నేత దక్కించుకున్న ఫంక్షన్ హాల్లోనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ నిర్వహించేలా చక్కబెడుతున్నట్లు సమాచారం. ఇక కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతి సమావేశం కూడా ఇక్కడే నిర్వహించే విధంగా లోలోపల ఒప్పందం గురించి కొన్ని రూ.లక్షలు కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్‌లోని వర్గం ఆరోపిస్తోంది. ప్రజలకు ఆహ్లాదాన్ని.. పర్యాటక ప్రాంతాలు గా మార్చాల్సింది పోయి ఇలా లీజుకు తీసుకొని గలీజ్ దందాలకు తెరలేపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న శిల్పారామన్నీ హఠాత్తుగా మే 6 న హడావుడిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని కార్పొరేషన్ అప్పగిస్తూ పర్యాటకశాఖ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎంవోయూపై సంతకాలు చేశారు. విచిత్రమేమో కానీ ఓపెన్ యాక్షన్ చేయకుండానే సదరు చోటా నేత లెక్కలు వేసుకొని చెప్పిన విధంగా ప్రధానమైన దుకాణాలు.. ఫంక్షన్ హాల్‌ను కేవలం నెలకు రూ.1,82,000 కు లీజుకు ఇచ్చారు. మూడేళ్ల లీజు అంటూ కార్పొరేషన్ అధికారులు అంటున్నప్పటికీ లోలోపల మాత్రం పదేళ్ల లీజుకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కనీసం ఎక్కడ ప్రచారం చేయకుండా.. మున్సిపల్ సమావేశంలో కూడా చర్చించకుండా ఏకపక్షంగా లీజుకు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
భవిష్యత్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు కూడా లీజుకు ఇచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. పర్యాటకశాఖకు చెందిన శిల్పారామాన్ని అక్రమంగా దక్కించుకున్న కాంగ్రెస్ నేతల వైఖరిపై మళ్లీ పడుతూ దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.