దామరగిద్ద : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ( Mid-day meals ) పెట్టాలని తహసీల్ కార్యాలయం ఎదుట పీడీఎస్‌యూ ( PDSU ) విద్యార్థులు తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నాయకులు సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ విద్యాసంస్థల పట్ల నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని అన్నారు.
విద్యార్థులకు రూ.8వేల కోట్లకు బకాయి ఉన్న స్కాలర్షిప్, రియింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులపై నియంత్రణ కరువైందని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో బాలుర, బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలని, పాఠశాల కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల కోసం బస్సులు వేయాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని, మండల కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ హాస్టల్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు గౌస్, మండల కార్యదర్శి ప్రసాద్, కృష్ణ, అంజి, పాఠశాల కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.