మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 12 : వైద్య విజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని ఎస్వీఎస్ దవాఖాన, మెడికల్ కళాశాల డైరెక్టర్ కేజే రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య విజ్ఞాన సదస్సును విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎస్వీఎస్ మెడికల్ కళాశాల స్థాపించి 25ఏండ్లు పూర్తయిన సందర్భంగా వైద్య విద్యార్థులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందితో కలిసి వైద్య విజ్ఞానం కోసం 2వేల స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ వీక్షించేందుకు ఉమ్మడి జిల్లాలోని 60వేల మందికి పైగా విద్యార్థులు వచ్చారని తెలిపారు. రాష్ట్రంలోనే ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాల తర్వాత ఎస్వీఎస్లో ఎంబీబీఎస్ చేసేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. కళాశాల రాష్ట్రంలో మూడోస్థానంలో గుర్తింపు సాధించిందన్నారు. సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుశీల్ జోషి, దవాఖాన రెసిడెన్సీ డైరెక్టర్ రాంరెడ్డి పాల్గొన్నారు.