నాగర్‌కర్నూల్, జూలై 5 : నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మాధవరం హన్మంతురావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బొడ్డు రమణ మాట్లాడారు. కొనుగోళ్లలో మార్కెట్ కమిటీ చైర్మన్ అవినీతిని పాల్పడినట్లుగా తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఆధారాలతోసహా ప్రజల ముందుకు తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మీరు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
సిద్ధమై తే నాగర్‌కర్నూల్ అంబేద్కర్ చౌరస్తాకు సోమవారం వచ్చి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేదని, రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించే తీరిక కూడా లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. నాడు బీఆర్ఎస్ హయాంలో రైతు రాజ్యం నడిపిస్తే నేడు కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన అంటూ రైతు ల పాలిట రాక్షస రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితిలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తే ప్రస్తుతం రైతు లు మార్కెట్ యార్డుల్లో ధాన్యం పోసినా, కొనుగోలు చే యాలని అధికారులను వేడుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాశాఖ అధికారులు నివేదిక ప్రకారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో లక్షా 4,263 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని, సగటున ఎకరాకు 40క్వింటాళ్ల దిగుబడి వస్తే మొత్తం 40 లక్షల క్విం టాళ్ల మొక్కజొన్న ఉత్పత్తి జరిగిందన్నారు. ఈ దిగుబడికి 80లక్షల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని తెలిసినా, ప్రభుత్వం కేవలం 20లక్షల గన్నీ బ్యాగులు మా త్రమే సరఫరా చేసి కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. ఈ కొరతను ఆసరాగా చేసుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అండదండలతో తన అనుచరులతో గన్నీ బ్యాగులను బ్లాక్‌లో రైతులకు విక్రయిస్తూ ఒక్కో బ్యాగుకు రూ. 5నుంచి 15 వరకు అక్రమంగా వసూలు చేసి కోటి రూపాయలకుపైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం ఒక్కో గన్నీ బ్యాగు కు రూ.22 రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా ఆ సమాచారం ఇవ్వలేదని, ఏఒక్క రైతు ఖాతాలో ఆమొత్తం జమ కాలేదన్నారు.
ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో ఎమ్మెల్యే, మార్కెట్ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ, అధికారికి సంబంధం లేకున్నా మార్కెట్ కమిటీ చైర్మన్ జోక్యం చేసుకొని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హమాలీకి ఒక్కో సంచికి రూ.26లు మాత్రమే చెల్లించాలని, రవాణా, హమాలీ పేరుతో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేయరాదని పీఏసీసీఎస్ అధికారులు స్పష్టం చేసినప్పటికీ, నాగర్‌కర్నూల్ మండలంలో పెద్దముద్దునూర్ తదితర కొనుగోలు కేంద్రాల్లో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఒక్కో సంచికి రూ.35 నుంచి రూ.50 అక్రమంగా వసూలు చేసి రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.
‘ఈ అవినీతిని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా’ అని సవాల్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాట నిలబెట్టుకోవాలని, సోమవారం ఉదయం 11 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబ్కేర్ చౌరస్తా వద్ద ఆధారాలతో తాము హాజరవుతామని, దమ్ముంటే నీవ్వైనా రా లేక నీ ఎమ్మెల్యేనైనా పంపు అంటూ బీఆర్ఎస్ నాయకులు బహిరంగ సవాల్ విసిరారు. అదేవిధంగా ఇటీవల బిజినేపల్లిలో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘నా పక్కన ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటా’ అంటూ ప్రకటించారని, మరీ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు చేసిన అవినీతి ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని, చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ నల్లగండి వెంకటయ్య, మాజీ ఎంపీపీలు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండు, మాజీ సర్పంచ్‌లు చిక్కొండ్ర నాగయ్య, రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మోత్కూరి నాగార్జున, తమటం రాజుగౌడ్, కిశోర్‌గౌడ్, కట్ట వంశీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.