Vitamin B12 | ఆందోళన, చిరాకు, అలసట వంటి సమస్యలకు ఒత్తిడి లేదా మానసిక ఆరోగ్య పరిస్థితులే కారణమని చాలామంది భావిస్తారు. అయితే శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించినా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంగుంది. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం మెదడు పనితీరు, నాడీ వ్యవస్థ, మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో బి12 స్థాయిలు తగ్గడం వల్ల ఆందోళనను పోలిన లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే ప్రతి వ్యక్తిలో దీని ప్రభావం ఒకేలా ఉండదు. విటమిన్ బి12 నాడులు సక్రమంగా పనిచేయడానికి, మెదడు మధ్య సమాచార మార్పిడికి అవసరమైన న్యూరోట్రాన్స్మిటర్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల శరీరంలో బి12 తగినంతగా లేకపోతే ఆందోళన, చిరాకు, భయాందోళన, మానసిక స్థితిలో మార్పులు, తక్కువ ఉత్సాహం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. విటమిన్ బి12ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్. మెదడు పనితీరు, నాడుల ఆరోగ్యం, ఎర్ర రక్త కణాల తయారీ, డీఎన్ఏ నిర్మాణం వంటి అనేక ముఖ్యమైన ప్రక్రియలకు ఇది అవసరం. శరీరం తగినంత బి12ను స్వయంగా తయారు చేసుకోలేకపోవడంతో ఆహారం ద్వారా పొందాలి. చేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, చికెన్, మాంసం వంటి వాటిలో విటమిన్ బి12 లభిస్తుంది.
నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంలో విటమిన్ బి12కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నరాలపై ఉండే మైలిన్ అనే రక్షణ పొరను నిర్వహించడంలో ఇది సహాయపడుతుంది. ఈ రక్షణ పొర సరిగ్గా ఉంటే మెదడు, వెన్నుపాము, శరీరంలోని ఇతర భాగాల మధ్య విద్యుత్ సంకేతాలు సక్రమంగా ప్రసారం అవుతాయి. బి12 లోపం ఏర్పడినప్పుడు నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎర్ర రక్త కణాల తయారీలోనూ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రభావితమై మెగాలోబ్లాస్టిక్ అనీమియా వంటి సమస్యలు ఏర్పడతాయి. దాంతో శరీరానికి ఆక్సిజన్ సరఫరా సరిగా జరగక అలసట, బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా బి12 అవసరం. ఈ విటమిన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడు జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనా సామర్థ్యంలో మార్పులు, మెదడు మబ్బుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన లోపం ఉన్నప్పుడు మరింత తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
విటమిన్ బి12 లోపం ఆందోళన లక్షణాలను పెంచడానికి ఒక కారణం అవుతుందని చెబుతున్నారు. శరీరంలో బి12 తక్కువగా ఉన్నప్పుడు మెదడు పనితీరుకు అవసరమైన కొన్ని రసాయన ప్రక్రియలు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా హోమోసిస్టీన్ అనే పదార్థాన్ని మెథియోనిన్గా మార్చే ప్రక్రియలో బి12 అవసరం. ఈ ప్రక్రియ మెదడు పనితీరు, మానసిక స్థితి నియంత్రణకు సంబంధించిన జీవరసాయన చర్యల్లో భాగం. బి12 లోపం వల్ల అలసట, బలహీనత, మెదడు మబ్బుగా అనిపించడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇవి రోజువారీ పనితీరుపై ప్రభావం చూపడంతో కొందరిలో ఆందోళన మరింత ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది. అలాగే నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కొన్నిసార్లు పానిక్ అటాక్ లక్షణాలను పోలి ఉంటాయి.
విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు శారీరక లక్షణాలతోపాటు నాడీ సంబంధిత లక్షణాలు కూడా కనిపిస్తాయి. తీవ్రమైన అలసట, బలహీనత, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, సమతుల్యత కోల్పోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు, మెదడు మబ్బుగా అనిపించడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన, చిరాకు, డిప్రెషన్, మూడ్లో మార్పులు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించిన ప్రతిసారీ బి12 లోపమే కారణమని భావించకూడదు. ఆందోళనకు అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయి. కొంతమందిలో విటమిన్ బి12 లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పూర్తిగా శాకాహార లేదా వేగన్ ఆహారం తీసుకునేవారిలో బి12 లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. సహజంగా బి12 లభించే మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు చాలా తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. వయసు పెరిగే కొద్దీ బి12 శోషణ తగ్గే అవకాశం ఉన్నందున వృద్ధుల్లోనూ లోపం కనిపిస్తుంది.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలోనూ ఆహారం నుంచి బి12 శరీరంలోకి శోషించుకోవడం తగ్గుతుంది. అలాగే మెట్ఫార్మిన్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వంటి కొన్ని మందులను దీర్ఘకాలం ఉపయోగించే వారు కూడా బి12 స్థాయిలపై వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. బి12 లోపం ఉన్నవారికి లోపాన్ని సరిచేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే బి12 స్థాయిలు సాధారణంగా ఉన్న ప్రతి ఒక్కరూ అదనంగా బి12 సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణ బి12 స్థాయిలు ఉన్నవారిలో కేవలం సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఆందోళన గణనీయంగా తగ్గుతుంది. ఎప్పటికప్పుడు లేదా నిరంతరం ఆందోళనగా అనిపించడం, కారణం తెలియని తీవ్రమైన అలసట, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, జ్ఞాపకశక్తి సమస్యలు, సమతుల్యతలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే విటమిన్ బి12 స్థాయిలను పరీక్షించుకోవడం గురించి వైద్యుడిని సంప్రదించవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలంగా శాకాహార లేదా వేగన్ ఆహారం తీసుకునేవారు బి12 స్థాయిలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
విటమిన్ బి12 లోపం కొన్ని సందర్భాల్లో ఆందోళనను పోలిన లక్షణాలకు లేదా నాడీ సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. అయితే ఆందోళనకు బి12 లోపమే ఏకైక కారణమని చెప్పలేం. లక్షణాలను బట్టి సరైన వైద్య పరీక్షలు చేయించుకుని అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. బి12 లోపం నిర్ధారణ అయితే వైద్యుల సూచన మేరకు ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా దాన్ని సరిచేసుకోవాలి.