stock market : భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 492 పాయింట్లు పతనం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయింది. ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 77,418.97 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. రోజులో 77,575.21 పాయింట్ల గరిష్ట స్థాయికి, 77,234.36 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు 492.70 పాయింట్ల (0.63 %) నష్టంతో 77,235.46 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 132.75 పాయింట్లు (0.55%) నష్టపోయి 24,154.90 వద్ద ముగిసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా గత ఐదు సెషన్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ వరుసగా ఆరు సెషన్ల నుంచి నష్టాలు పొందుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 0.89% లాభపడింది. పవర్ గ్రిడ్ 0.66%, ఎంఅండ్ఎం అడ్వాన్సుడ్ 0.47%, బజాజ్ ఫైనాన్స్ 0.27%, లార్సెన్ అండ్ టర్బో 0.15%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.88% లాభపడ్డాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ షేర్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. మరోవైపు ఏసియన్ పెయింట్స్ అత్యధికంగా 2.40% నష్టపోగా, హెచ్‌సీఎల్ టెక్ సంస్థ 1.93%, భారతీ ఎయిర్టెల్ 1.75%, ఇన్ఫోసిస్ 2.02%, టీసీఎస్ 1.47%, హిందుస్తాన్ యునీలివర్ 1.41% నష్టపోయాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 91 డాలర్లుగా ఉంది. అలాగే, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ బ్యారెల్ ధర 84.99 డాలర్లుగా ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 9 % పెరిగింది. రూపాయి విలువ స్వల్పంగా తగ్గి ఫ్లాట్‌గా ముగిసింది.
డాలర్‌తో 7 పైసలు తగ్గిన రూపాయి 95.68 వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,394.72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఐటీ, రియాల్టీ, బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడం, పశ్చిమాసియా యుద్ధం కారణంగా నెలకొన్ని అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరల పెరుగదల వంటివి మార్కెట్ పతనానికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. జపాన్ నిక్కీ 2.5 శాతం నష్టాలు పొందగా, దక్షిణ కొరియా కోస్పి లాభాల్లో ముగిసింది. యురోపియన్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.