Vijay-Trisha : తమిళనాడు రాజధాని చెన్నైలో ఇటీవల జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలకు నటి త్రిష హాజరైన సంగతి తెలిసిందే. నటుడు విజయ్ తొలిసారి సీఎం హోదాలో అధికారికంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, స్వతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు విజయ్‌కు సన్నిహితురాలిగా పేరున్న త్రిష కూడా హాజరయ్యారు. అది కూడా అతిథుల జాబితాలో ముందు వరుసలో, విజయ్ తల్లిదండ్రులతో కలిసి కూర్చున్నారు. ఈ అంశంపైనే ఇప్పుడు డీఎంకే అధికార పత్రిక మురసోలి మండిపడింది.
విజయ్- త్రిషల ఈ చర్య సిగ్గు చేటు అని, అవమానకరం అని మురసోలి వ్యాఖ్యానించింది. ఈ మేరకు మురసోలి పత్రిక ఎడిటోరియల్‌లో ఈ అంశంపై స్పందించింది. స్వాతంత్య్ర దిన వేడుకల్లో త్రిష అతిథులతో కలిసి ముందు వరుసలో కూర్చున్నారు. జెండా వందనం సందర్భంగా త్రిష, విజయ్ పరస్పరం సెల్యూట్ కూడా చేసుకున్నారు. ఒక నటి ఏ హోదాలో ఇక్కడ కూర్చున్నారు అంటూ మురసోలి ప్రశ్నించింది. అధికారిక కార్యక్రమంలో త్రిష, విజయ్ ప్రవర్తించిన తీరు అవమానకరం అంటూ అభిప్రాయపడింది. నటికి సీఎం సెల్యూట్ చేయడం ఏంటని విమర్శించింది. స్వాతంత్య్ర దినం రోజు ముఖ్యమంత్రి గౌరవం గాలిలో కలిసిపోయిందని, ఏమాత్రం సిగ్గు, సంకోచం లేకుండా అలా ఎలా చేస్తారని మురసోలి పత్రిక ప్రశ్నించింది. ఈ విషయాన్ని విజయ్‌కు ఓటేసిన వారు, అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని అభిప్రాయపడింది.
ఇటీవల నటి త్రిషపై డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను విజయ్ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఉదయనిధి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వేడుకల విషయంలో విజయ్, త్రిషపై ఆ పార్టీ ఇలా విమర్శలకు దిగింది. తమిళనాడులో ప్రస్తుతం విజయ్ టీవీకే వర్సెస్ డీఎంకే రాజకీయం కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కూడా అక్కడ అదే వేడి వాతావరణం కనిపిస్తోంది.