నాగర్‌కర్నూల్, మార్చి 27 : కందనూలు నియోజకవర్గ గడ్డపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు. ముందుగా నాగర్‌కర్నూల్ బస్టాండ్ కూడలిలో కార్యకర్తలు పెద్దఎత్తున మర్రి జనార్దన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. భారీ క్రేన్లు ఏర్పాటు చేసి మర్రికి గజమాల వేశారు. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పటాకులు కాలుస్తూ కార్యకర్తలు పెద్దఎత్తున వేడుకలు చేశారు. వేడుకలను తిలకించడానికి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యకర్తల మధ్య ఏర్పాటు చేసిన కేక్‌ను మర్రి కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నాకు అండగా నిలబడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానని, తన దగ్గర ఉండి అన్ని విధాలుగా లబ్ధిపొంది రాత్రికి రాత్రే పార్టీ మారిన చెత్తాచెదారం పోయిందన్నారు. ప్రస్తుతం 24క్యారెట్ల బంగారం తన వెంట ఉందని, వారికి నా అండదండలు ఎన్నటికీ ఉంటాయన్నారు.
కార్యకర్తల రుణం ఈ జన్మ అంతా మీకు సేవ చేసినా తీర్చుకోలేనని, మీ అభిమానానికి కృతజ్ఞుడిని అన్నారు. సహజంగా సినిమా హీరోలకు జన్మదినాలు జరిగితే అవి సినిమా టాకీస్లకే పరిమితమవుతాయని, జనంలో ఉన్న నాయకులకు జన్మదిన వేడుక అంటే ఇలా ఉంటుందన్న విధంగా కార్యకర్తలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సంతోషం వ్యక్తం చేశారు. తాను పదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో బెల్లం ఉన్న వద్ద ఈగలు వాలినట్లు పక్క పార్టీల నుంచి కొన్ని దుష్టశక్తులు నా చెంత చేరి అన్ని విధాలుగా లబ్ధిపొంది మోసంచేసి రాత్రికి రాత్రే పార్టీ మారారని, వారిని తన దరికి చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పార్టీ మారిన వారిని మళ్లీ చేర్చుకోవాలంటే ఆ గ్రామంలోని నాయకులు కార్యకర్తలు చేర్చుకోవాలి తప్పా నా వరకు రాకూడదన్నారు. కొందరు అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడితో కార్యకర్తలు నా జన్మదిన వేడుకల ఏర్పాటు చేస్తుంటే అడ్డుకునే కుట్రలు చేశారని, అలాంటి అధికారులు ఎప్పటికీ నా దృష్టిలో ఉంటారని మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. నా కార్యకర్తలను వేధించిన అధికారులు, పోలీసులు, చివరికి రాజకీయ నాయకుల పేర్లను పింక్ డైరీలో పొందుపరుచుకుంటామన్నారు. భవిష్యత్ లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మ ంత్రి అవుతానని అప్పుడు వారి సం గతి చూస్తానని కార్యకర్తల హర్షద్వానాల మధ్య మర్రి జనార్దన్‌రెడ్డి ప్రకటిం చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి రెండున్నర ఏండ్లు పూర్తవుతున్నా ప్రజాసమస్యలను పక్కన పెట్టి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, స్థాని క నాయకత్వంపై పోరుకు సన్నద్ధం అవుతున్నామన్నారు. రేపటి నుంచి నియోజకవర్గం లో అధికారులు, నాయకుల తీరుపై ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలకు శ్రీకారం చూడుతున్నామన్నారు.
తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత భారీఎత్తున తిమ్మాజిపేట, బిజినేపల్లి, తాడూ రు, తెలకపల్లి మండలాలు, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా మర్రి జనార్దన్‌రెడ్డి పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నా యకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి శుక్రవారం నిర్వహించుకునే పుట్టిన రోజు వేడుకలకు పోలీసులు, అధికారులు పలు ఆంక్షలు విధించారు. స్తంభాలకు స్పోక్ పటాకులు ఏర్పాటు చేయడంతో తొలగించాలని పోలీసులు పట్టుబట్టడంతో కొద్దిసేపు బీఆర్ఎస్ నాయకులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. చిన్నపాటి పటాకులు ఏర్పాటు చేస్తే పర్మీషన్ లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారని, వెంటనే తొలగించాలని పోలీసులు పట్టబట్టారు. పుట్టిన రోజు వేడుకలను ఏర్పాటు చేయడంతో జీర్ణించుకోలేని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.