బిజినేపల్లి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన పానుగంటి కృష్ణ అనే వికలాంగుడు పింఛన్ మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆయన పట్టించుకోలేదు. కనీసం మాట్లాడడానికి ఒక్క నిమిషం సమయం కూడా ఇవ్వలేదు. దాంతో ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తూ కృష్ణ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చూసి వెంటనే స్పందించారు. వికలాంగుడు కృష్ణకు ప్రతి నెల రూ.4 వేలు తన సొంత డబ్బులు అందజేస్తానని తెలిపారు. అందులో భాగంగా బుధవారం బిజినపల్లి మండలంలోని గంగారం గ్రామంలో వికలాంగుడైన కృష్ణకు మర్రి జనార్దన్ రెడ్డి పంపిన రూ.4 వేలను స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసేవరకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రతి నెల కృష్ణకు రూ.4 వేలు అందజేస్తారని అన్నారు. సోషల్ మీడియాలో వీడియో చూసి తనకు అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కృష్ణ తెలిపారు. గతంలో తాను కింద పడ్డప్పుడు మర్రి అపరేషన్ చేయించారని, తనకు చాలా సార్లు మర్రి ఆర్థిక సాయం అందించారని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, రవి, తిరుపతయ్య బస్వి రెడ్డి తదితరులు ఉన్నారు.