అచ్చంపేట, మార్చి 27: దోమల పెంట వద్ద జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించి భార్య స్వర్ణలతకు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.25 లక్షలఎక్స్ గ్రేషియాను కుటుంబసభ్యులకు అందజేసినట్లు గురువారం పేర్కొన్నారు. కాగా, గత ఫిబ్రవరి 22న టన్నెల్ నందు ప్రమాదం జరుగగా ఎనిమిది మంది కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు చిక్కుకొని జలసమాధి అయ్యారు.
వారికోసం రెస్క్యూ సిబ్బంది అన్వేషణ చేస్తున్నారు. సహాయక చర్యలకు అనేక అడ్డంకులు వస్తున్న వాటీని అధిగమిస్తూ మృతదేహాల వెలికితీతకు శాయశక్తుల శ్రమిస్తున్నారు. 8 మందిలో 16వ రోజు గురుప్రిత్ సింగ్ మృతదేహం లభ్యం కాగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం ప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్ కుమార్ మృతదేహన్ని బయటకు తీసిన తర్వాత నిర్ధారణ చేసి నాగర్ కర్నూల్ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం జేపీ కంపెనీ ప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ప్రత్యేక అంబులెన్సు ద్వారా స్వస్థలానికి డెడ్ బాడీని తరలించి అప్పగించారు.