మహబూబ్‌నగర్ విద్యావిభాగం, జూలై 28 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్‌స్థాయి విద్యా సౌకర్యాలు కల్పించాలన్న సంకల్పంతో ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ పథకం కొనసాగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నీలినీడలు కమ్ముకుంటున్నా యి. జిల్లాలో రూ.16 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడం తో కాంట్రాక్లర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లే దు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, డైనింగ్‌హాల్, తాగునీరు, విద్యుత్, మేజర్, మైనర్ రిపేర్లు ఇలా మొత్తం పన్నెండు రకాల పనులను చేపట్టాలన్నది అప్పటి ప్రభుత్వ లక్ష్యం.
ఇం దుకు రూ.కోట్ల నిధులు కేటాయించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరాక పనులు పూర్తిగా పడకేశాయి. జిల్లాలో 291 పాఠశాలలను మొదటి విడుతలో వివిధ రకాల పనులకు ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. ఇందుకుగానూ రూ.125 కోట్ల ప్రతిపాదనలతో పలు పాఠశాలల్లో మౌలిక వసతులు, బ్లాక్‌బోర్డుల స్థా నంలో గ్రీన్ బోర్డులు, ఆధునిక వసతులతో కూడిన భోజనశాల, డ్యూయల్ డెస్క్‌లు, మరుగుదొడ్లు వంటివి కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుల విడుదలలో జాప్యం చేయడంతో పనులు ముందుకు సాగక చతికిలబడ్డాయి. చాలా చోట్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కొన్నిచోట్ల తరగతి గదులు కూల్చివేయడం.. కొత్తవి పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద కేసీఆర్ సర్కా రు చేపట్టిన పనుల కొనసాగింపుపై కాంగ్రెస్ ఎటువంటి స్ప ష్టత ఇవ్వడం లేదు. కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో జిల్లావ్యాప్తంగా 130 పాఠశాలల్లో తాగునీరు, మైనర్ రిపేర్లు, నిర్వహణలేక నిరుపయోగంగా మారిన మూత్రశాలలు, మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకురావడం, విద్యు త్, బాలికలకు కొత్తగా టాయ్లెట్ల నిర్మాణం వంటి తక్కువ ఖర్చుతో చేపట్టే పనులు మాత్రమే చేపడుతున్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పనులు పూర్తైన 53 పాఠశాలలు ప్రారంభించారు. 37పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 111పాఠశాలల్లో పేయింటింగ్ పను లు పూర్తయ్యాయి. మిగిలిన చోట్లా పిల్లర్ల దశలో కొన్ని, పునాది స్థాయిలో, స్లాబ్ నిర్మాణాలు, రంగులు వేసే పనులు కొనసాగుతున్నాయి. సివిల్ పనులకు సంబంధించి రూ.70 కోట్ల పనుల ప్రతిపాదనలకు గానూ ఇప్పటి వరకు రూ.23.5 కోట్లు మాత్రమే చెల్లించారు. పూర్తైన పనులకు సంబంధించి అధికారికంగా ఎంబీ రికార్డులు పూర్తైన రూ.16 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పనులు పూర్తైనా బిల్లులు రాకపోవడంతో నిధుల మంజూరు కోసం కాంట్రాక్టర్లు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు.
మన ఊరు-మన బడిలో మౌలిక వసతుల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. మిగులు పనులు కొనసాగిస్తాం. పనిచేసే కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించే బాధ్యత ప్ర భుత్వానిది. నిధులు పెండింగ్ ఉన్నది వాస్తవమే. బడ్జెట్‌కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే చెల్లిస్తాం.
– రవీందర్, డీఈవో, మహబూబ్‌నగర్