హన్వాడ మే 19 : కాంగ్రెస్ పాలనలో ప్రజలు రోజు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా హన్వాడ మండలంలోని టంకర, గుడిమల్కాపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్డును బీటీ రోడ్డు వేసేందుకు ఇరువైపులా మట్టి తీశారు.
అయితే రాత్రి కురిసిన వర్షానికి వర్షపు నీరు రోడ్డుపై నిల్వడంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సోమవారం గుడి మల్కాపురం గ్రామస్తులు రోడ్డుపై వరినట్లు వేస్తూ నిరసన తెలిపారు. రోడ్డును త్వరగా పూర్తి చేయాలని పలు పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.