మక్తల్, జూన్ 13 : ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తెలంగాణను మాగాణిగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద వస్తుండగా భీమా ఫేజ్-1కు సంబంధించి చిన్నగోప్లాపూర్ వద్ద, మక్తల్ తిరుమలయ్య చెరువుకట్ట వద్ద స్టేజ్-2 పంప్‌హౌస్ మోటర్లను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరం దించాలనే లక్ష్యంతో చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్,
భూత్పూర్ రిజర్వాయర్లను కృష్ణ నీటితో నింపేందుకు పంపింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. 100 రోజులపాటు నీటిని ఎత్తిపోసి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సాగునీరు అందించి పాడిపంటలు పండేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రతి రైతును ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇప్పటికే అన్ని మండలాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు వెంకటరమణ, నాగశివతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటాం
దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), జూన్ 13 : పా లమూరు జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగర్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పే ర్కొన్నారు. గురువారం చిన్నచింతకుంట మండలం ఉం ద్యాల వద్ద జూరాల నుంచి కోయిల్‌సాగర్ ఫేజ్ -1కు సంబంధించిన మోటర్లను ప్రాజెక్టు అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జూరాల కు వరద చేరుతున్న సందర్భం గా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కోయిల్‌సాగర్‌ను నింపేందుకు ఉంద్యాల నుంచి ఫర్దీపూర్ జలాశయానికి ఫేజ్-1కు సంబంధించిన మోటర్లు ప్రారంభించి పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. వెనుక జలాలను ముందస్తుగా తోడి కోయిల్‌సాగర్‌ను నిం పుకొంటే కాల్వల ద్వారా ఆయకట్టుకు, గొలుసుకట్ట చెరువులను నింపుకొనే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.